
అందుబాటులోకి టెలీ రోబోటిక్ సర్జరీలు
సాక్షి, సిటీబ్యూరో: ‘రోబోటిక్ సర్జరీలు చేశాం..టెలీ సర్జరీల గురించి విన్నాం...ఈ రెండింటిని కలపి సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఖచ్చితత్వంతో కూడిన టెలీ రోబోటిక్ సర్జరీ చేయడం కొత్త టెక్నాలజీ’ అని ప్రీతీ కిడ్నీ ఆసుపత్రి ఎండీ చంద్రమోహన్ అన్నారు. బుధవారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టుకతోనే కిడ్నీ సమస్య ఉన్న 16 నెలల బాలుడికి చికిత్స చేయాల్సి వచ్చిందన్నారు. అయితే గురుగ్రాంలో ఉన్న తాను కొండాపూర్ ప్రీతి ఆసుపత్రిలో ఉన్న బాలునికి టెలీ–రోబోటిక్ పద్ధతిలో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశానని చంద్రమోహన్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. మరో కేసులో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ మహిళకు గర్భసంచి తొలగించిన తరువాత సమస్య రావడంతో తమను సంప్రదించారని, ఆమెకు టెలీ–రోబోటిక్ సర్జరీ విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ప్రీతి ఆసుపత్రి ఈడీ డా.రూప, సీఈఓ రంగప్ప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.