ప్రాణహిత–చేవెళ్ల.. రూ.35 వేల కోట్లు! | New pre-feasibility report for Pranahita Chevella project | Sakshi
Sakshi News home page

ప్రాణహిత–చేవెళ్ల.. రూ.35 వేల కోట్లు!

Sep 19 2025 1:18 AM | Updated on Sep 19 2025 1:18 AM

New pre-feasibility report for Pranahita Chevella project

ఆదిలాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై ప్రతిపాదిత బరాజ్‌ నిర్మాణ ప్రాంతం (ఫైల్‌)

ప్రాజెక్టుకు కొత్తగా ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు 

రీ ఇంజనీరింగ్‌లో తొలగించిన 9 ప్యాకేజీల పనుల పునరుద్ధరణకు కసరత్తు 

9 ప్యాకేజీల అంచనాలు సవరిస్తే వ్యయం ఈ మేరకు పెరిగే అవకాశం 

మొత్తం పనులను 3 విభాగాలుగా చేసి పీఎఫ్‌ఆర్‌లో ప్రతిపాదనలు! 

తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌.. 80 టీఎంసీల తరలింపు లక్ష్యం 

ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలు సవరిస్తూ కొత్త ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌ఆర్‌) సిద్ధమవుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 1, 2, 3, 4, 5, 23, 24, 25, 26 ప్యాకేజీల పనులను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రీ ఫీజబిలిటీ నివేదికను సిద్ధం చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన అధికారులు..పెరిగిన ధరల ప్రకారం ఈ 9 ప్యాకేజీల పనుల అంచనాలను సవరిస్తే, ప్రాజెక్టు వ్యయం ఐదారు రెట్లు పెరిగి రూ.35 వేల కోట్లకు చేరే అవకాశం ఉందనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. 

మూడు కాంపొనెంట్లుగా విభజన: ఈ 9 ప్యాకేజీల పనులను మూడు విభాగాలుగా పీఎఫ్‌ఆర్‌లో ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మాణం, బరాజ్‌ నుంచి గ్రావిటీ ద్వారా 20 టీఎంసీలను ఆదిలాబాద్‌ జిల్లాకు తరలించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ నుంచి రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. 

ప్యాకేజీలు–1, 2, 3, 4, 5 పూర్తైతే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందనుంది. ప్యాకేజీలు–23, 24, 25, 26 పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకర్గాల్లోని మొత్తం 2.47లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రంగారెడ్డి జిల్లాలోని హాల్దీ, మూసీ నదులకు, చేవెళ్ల చెరువుకు తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు సరఫరా కానున్నాయి. 

త్వరలో మహారాష్ట్రకు రాష్ట్ర బృందం 
మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి అంగీకారం తీసుకోవాలని కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి వద్ద నుంచి 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా మొత్తం 80 టీఎంసీల నీళ్ల తరలింపును పీఎఫ్‌ఆర్‌లో ప్రతిపాదిస్తున్నారు. గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల కేటాయింపులకు లోబడే ఈ ప్రతిపాదనలు చేస్తున్నారు. 

త్వరలో నీటిపారుదల శాఖ అధికారుల బృందం తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరపనుంది. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని గతంలో సీడబ్ల్యూసీ తేల్చింది.  

రీ ఇంజనీరింగ్‌లో ఈ ప్యాకేజీలు తొలగింపు 
ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రకారం.. గోదావరిపై ఆదిలాబాద్‌ జిల్లా కౌతాల మడంలం తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించి 165 టీఎంసీల నీళ్లను తరలించడం ద్వారా మొత్తం 16.4 లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను చేపట్టింది. 

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు మార్పులు చేర్పులతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. తొలి ప్రాజెక్టులో ప్యాకేజీలు–1, 2, 3,4, 5, 23, 24, 25, 26 కింద ప్రతిపాదించిన పనులను తొలగించి మిగతా పనులను కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టింది. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతిపాదించిన 2 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదించిన 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా కలగానే మిగిలిపోయింది. 

ప్యాకేజీ–3 కింద తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్, ప్యాకేజీ–1, 2, 4 కింద తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కి.మీల ప్రధాన కాల్వ, ప్యాకేజీ–5 కింద మైలారం వద్ద పంప్‌హౌస్‌తో పాటు అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీళ్లను తీసుకెళ్లే కాల్వను నిర్మించాల్సి ఉంది. ఈ ఐదు ప్యాకేజీల పనులకు తొలుత రూ.3,084.13 కోట్లతో అంచనాలు రూపొందించగా, తర్వాత రూ.4,204 కోట్లకు సవరించారు. కాగా రీ ఇంజనీరింగ్‌కు ముందే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రూ.11,150 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు 71.5 కి.మీల కాల్వ నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement