
ప్రత్యేక ప్రచారం.. ఫుడ్ వెండర్స్‌కు శిక్షణ
రుణాల పంపిణీ కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: వీధి వ్యాపారుల సంక్షేమం, తదితర కార్యక్రమాల కోసం మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్లలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు ‘లోక్ కల్యాణ్’ మేళాల పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా వీధి వ్యాపారాలు చేస్తున్న వారిని ప్రధానమంత్రి వీధివ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) స్కీమ్‌లో చేర్చనున్నారు.
గురువారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ దిగువ పనులు చేయనున్నారు.
పునఃరూపకల్పన చేసిన పీఎం స్వనిధి పథకం కింద కొత్త దరఖాస్తులను ప్రోత్సహించడం
ఇప్పటికే మంజూరైన దరఖాస్తులకు రుణ పంపిణీ సులభతరం చేయడం
బ్యాంకుల్లోని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం
ఫుడ్ సేఫ్టీ అండ్ స్డాండర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సహకారంతో వీధి ఆహార విక్రేతలకు శిక్షణ ఇవ్వడం
వీధి వ్యాపారుల కుటుంబాల సామాజిక–ఆర్థిక వివరాలు సేకరించడం
వీధి విక్రేతల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం.. తగిన సంక్షేమ పథకాలతో ఆదాయం పెరిగేలా చేయడం.
రుణ పంపిణీ లక్ష్యం
14,800 మందికి రుణాలివ్వనున్నారు. ఇందులో 13,470 మందికి తొలి విడతలో ఇప్పించనున్నారు. రెండో విడత 1330 మందికి ఇస్తారు. తొలి విడతలోని వారికి ఇచ్చే రుణం రూ.15వేలను 12 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రెండో విడత వారికి ఇచ్చే రూ. 25వేల రుణాన్ని 18నెలల్లో తిరిగి చెల్లించాలి.
వెయ్యి మందికి శిక్షణ
వీధి విక్రేతల్లో ఆహార పదార్థాలు విక్రయించే వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు.. కల్తీ లేకుండా వినియోగించడం తదితర అంశాలపై రెండు విడతలుగా వెయ్యిమందికి శిక్షణ ఇస్తారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులిప్పించనున్నారు.ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ ఎగ్రిగేటర్లు (డీపీఏ), టౌన్ వెండింగ్ కమిటీలు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు, ఎన్జీఓలు, విక్రేతల సంఘాలు, తదితర ఆర్గనైజేషన్లు పాల్గొంటాయి.
జీహెచ్‌ఎంసీలో వీధి విక్రేతలకు 2020 నుంచి ఇప్పటి వరకు అందజేసిన రుణాలు
మొదటి విడత 1,34,412 మందికి రుణాలిప్పించడం లక్ష్యంగా పెట్టుకోగా 58,600 మందికి మాత్రం రూ.58.60 కోట్ల రుణాలిప్పించారు.
రెండో విడతలో 34,035 లక్ష్యం కాగా, 26,92 మందికి రూ. 52.18 కోట్ల రుణాలిప్పించారు.
మూడో విడత లక్ష్యం 7,178 అంతకంటే ఎక్కువమందికి రుణాలిచ్చారు. 10,686 మందికి రూ. 53.43 కోట్ల రుణాలు అందజేశారు.