
అమెరికాలో మహబూబ్‌నగర్ యువకుడు మృతి చెందాడు. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు.
మహబూబ్‌నగర్ రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్.. డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని.. తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్‌కు తీసుకురావడంలో సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత కాన్సులేట్ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు.