
జలమయమైన హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్– మహావీర్ ఆస్పత్రి రహదారి
ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రతాపం
సాయంత్రం 4 తర్వాత భారీ వర్షం
హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌జామ్.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఒకేరోజు మిశ్రమ వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు భానుడు ప్రతాపం చూపగా.... ఆ తర్వాత ఒకేసారి ఆకాశం మేఘావృతమై వరుణ దేవుడు విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. గురువారం గంటన్నర పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర జీవనం కకావికలమైంది. ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం పడింది. అత్యధికంగా పాతబస్తీ బహదూర్‌పురాలోని జూపార్క్ వద్ద 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ప్రధాన రహదారులు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బస్తీల్లోని నివాసాల్లో వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం వేళ విద్యాసంస్థలు వదలడంతో విద్యార్ధులు, డ్యూటీలు ముగించుకొని ఇంటి దారి పట్టిన ఉద్యోగులు ట్రాఫిక్‌లో గంటల కొద్దీ నరక యాతన పడ్డారు. వరద ఉధృతికి రోడ్లపై అడుగు పెడితే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పక్కన నిలిపిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకొని పోయాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
నాలుగు దిక్కులా చక్ర బంధం
భారీ వర్షానికి హైదరాబాద్ నలుదిక్కులా చక్రబంధంగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. నాంపల్లి నుంచి మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్, సోమాజిగూడ నుంచి మియాపూర్, సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్, మెహిదీపట్నం నుంచి రాయదుర్గం, చాంద్రాయణ గుట్ట నుంచి మలక్‌పేట, ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ తదితర మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ వాహనదారులు నరకయాతన పడ్డారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
మూడు రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల్లోనే కుంభవృష్టిగా కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.