
నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
55,378 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు ● హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా
సాక్షి,సిటీ బ్యూరో: ఎట్టకేలకు హైదరాబాద్‌లో కొత్త రేషన్ (ఆహార భద్రత) కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. వరసగా మూడు రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారుల కుటుంబాలకు వాటిని పంపిణీ చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించి లబ్ధి కుటుంబాలకు అందజేయనున్నారు. తొలి విడతగా రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మూడు రోజుల్లో తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. రెండో విడతలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు.
కొత్తగా 55,378 రేషన్‌కార్డులు
హైదరాబాద్ జిల్లాలో సుమారు 55,378 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మొత్తం మీద సుమారు 2,26, 272 కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా ద్వారా పౌరసరఫరాల శాఖకు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 89,919 దరఖాస్తులపైన మాత్రమే క్షేత్ర స్థాయి విచారణ పూర్తికాగా, మిగిలిన 1,36,353 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు 3,910 కుటుంబాలను అనర్హులుగా గుర్తించారు. మిగిలిన అర్హత సాధించిన దరఖాస్తుల్లో 55,378 కుటుంబాలకు కార్డులు మంజూరు కాగా, ప్రస్తుం ఎసీఎస్‌ఓ లాగిన్‌లో 6,090, డీసీఎస్‌ఓ లాగిన్‌లో 24,541 దరఖాస్తులు ఆమోదానికి పెండింగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా గత ఆరు నెలలుగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికి క్షేత్ర స్థాయి విచారణ మాత్రం నత్తలకే నడక నేర్పిస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగడంతో కార్డుల వెరిఫికేషన్ వేగవంతమైనట్లు సమాచారం.
నగరంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షెడ్యూల్ ఇలా...
తేది నియోజకవర్గం సమయం వేదిక
ఆగస్టు 1 ఖైరతాబాద్ ఉదయం 10 గంటలు బంజారా భవన్
,, కంటోన్మెంట్ మధ్యాహ్నం 12 గంటలు లే ప్యాలెస్
,,, జూబ్లీహిల్స్ మధ్యాహ్నం 3 గంటలు రహమత్ నగర్
ఆగస్టు 2 అంబర్‌పేట ఉదయం 10గంటలు అంబర్‌పేట
,, ముషీరాబాద్ మధ్యాహ్నం 12 గంటలు ముషీరాబాద్
,, సికింద్రాబాద్ 3.00 గంటలు సికింద్రాబాద్
ఆగస్టు 3 చార్మినార్ ఉదయం 10 గంటలు చార్మినార్
,, కార్వాన్ మధ్యాహ్నం 12 గంటలు కార్వాన్
,, చాంద్రాయణ గుట్ట మధ్యాహ్నం 3 గంటలు చాంద్రాయణ గుట్ట
హైదరాబాద్ కొత్త రేషన్ కార్డుల మంజూరు ఇలా
నియోజక వర్గం మంజూరైన
కార్డులు
మలక్‌పేట 3,926
యాకుత్‌పురా 3,174
చార్మినార్ 4,738
చాంద్రాయణగుట్ట 6,461
బహద్దూర్‌పురా 5,287
గోషామహల్ 3,028
కార్వాన్ 5994
అంబర్‌పేట 3,358
ఖైరతాబాద్ 1,953
జూబ్లీహిల్స్ 5,284
నాంపల్లి 5,157
ముషీరాబాద్ 2,672
సనత్‌నగర్ 1,393
కంటోన్మెంట్ 1,150
సికింద్రాబాద్ 1,803