
ఫార్మాసిటీలో మరోసారి సర్వే
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో అధికారులు మరోసారి సర్వేకు సిద్ధం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. రెండు నెలల క్రితం ఫార్మాసిటీ బౌండరీని సర్వే చేసి, ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. తాజాగా గురువారం బౌండరీ లోపల హద్దులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో సర్వే నంబర్ల వారీగా గుర్తించే పనులను మొదలుపెట్టారు. గ్రామంలోని పలు అసైన్డ్, పట్టా భూముల సర్వేనంబర్ల వారీగా ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు పరిహారం అందజేశామనే వివరాలతో కూడిన రికార్డుల ప్రకారం హద్దులు గుర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ భూముల వద్దకు రావద్దని అడ్డుకున్నారు.
అభ్యంతరం చెప్పడం సరికాదు
నిర్వాసితులకు పరిహారంతో పాటు తాజాగా మీరాఖాన్‌పేటలోని టీజీఐఐసీ వెంచర్‌లో లాటరీ తీసి ప్లాట్ల కబ్జాలు ఇచ్చామని ఆర్డీఓ అనంత్‌రెడ్డి తెలిపారు. అయినా రైతులు అభ్యంతరం తెలపడం సరికాదన్నారు. పరిహారం అందజేసిన, రికార్డులు మారిన భూములన్నీ ప్రభుత్వాని వేనని, ఆ భూముల్లోకి ఎవరూ రావొద్దని సూచించారు. కోర్టు కేసులున్న భూముల్లోకి వెళ్లమని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వే చేస్తున్న భూముల వద్దకు రైతులెవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
సర్వేనంబర్ల వారీగా భూమి గుర్తింపు
అడ్డుకున్న నక్కర్తమేడిపల్లి రైతులు
ఉద్రిక్త వాతావరణం
భారీ పోలీసు బందోబస్తు
బందోబస్తు మధ్య ఫార్మా ఫెన్సింగ్
కందుకూరు: ఫార్మాసిటీ కోసం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్ 123కు సంబంధించి గురువారం అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఫెన్సింగ్ పనులు చేపట్టారు. దీంతో సర్వే నంబర్‌ను ఆనుకుని ఉన్న దెబ్బడగూడ రెవెన్యూ సర్వే నంబర్ 31లోని గిరిజన రైతులు పనులను అడ్డుకున్నారు. తమ భూమిలోకి జరిపి ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ నిలదీశారు. సర్వే చేసిన తర్వాతే ఫెన్సింగ్ వేసుకోవాలని పట్టుబట్టారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకీరెడ్డి, సీఐ సీతారాం రైతులతో మాట్లాడారు. పది రోజుల్లో దెబ్బడగూడ సర్వే నంబర్ 31ని సర్వే చేయిస్తామని, అప్పటి వరకు ఫెన్సింగ్ పనులు ఆపొద్దని అన్నారు. భూమి మీకు వస్తే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.