
అమెరికన్ కాన్సులేట్‌లో వెయిటింగ్ ఏరియా ప్రారంభం
రాయదుర్గం: నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని అమెరికా కాన్సుల్ జనరల్ హైదరాబాద్ క్యాంపస్‌లో వెయిటింగ్ ఏరియాను గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ వెయిటింగ్ ఏరియాను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్మించింది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అమెరికాతో భాగస్వామ్యం, కొత్త ఆవిష్కరణలు, పురోగతి ప్రజల సంక్షేమానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తూ రెండు ప్రాంతాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. జెన్నీఫర్ లార్సన్ మాట్లాడుతూ ఈ వెయిటింగ్ ఏరియా నిర్మాణంతో అమెరికా వీసాలను సమర్థవంతంగా పరీక్షించడానికి, ప్రాసెస్ చేయడానికి యూఎస్ ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. వేలాదిమంది వీసా దరఖాస్తుదారులకు, ప్రతిరోజు కాన్సులేట్‌ను సందర్శించే కుటుంబాలకు సౌకర్యం, సౌలభ్యాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు, టీజీఐఐసీ సంస్థ ఉన్నతాధికారులు, అమెరికన్ కాన్సులేట్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.