
చినుకుతో చిగురుటాకులా..
భారీ వర్షంతో వణికిన నగరం
భారీ వర్షంతో మహా నగరం చిగురుటాకులా వణికింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో శుక్రవారం సిటీ విలవిలలాడింది. వరద నీటితో రహదారులు నీట మునిగాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాంతో వాహన చోదకులు నరకయాతన అనుభవించారు. అర కిలోమీటర్ దూరానికి గంటల కొద్దీ సమయం పట్టింది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బస్తీల వాసులు ఇబ్బందుల పాలయ్యారు. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి 9 గంటల వరకు బోయినపల్లిలో 11.5 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. – సాక్షి, సిటీబ్యూరో
ముంపు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: ముంపు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు కూడా రంగంలోకి దిగాయి. వరద నీటితో ఇళ్లలో చిక్కుకున్న బాధితులను డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అప్రమత్తంగా ఉండండి
నగర ప్రజలకు, అధికారులకు మేయర్ సూచన
లక్డీకాపూల్: భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. అవసరమైన సహాయం హెల్ప్‌లైన్ 040– 21111111 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ, హైడ్రా బృందాలు ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆమె ఆదేశించారు. రోడ్డుపై నిలిచిన నీటితో, నాలా వద్దకు వృద్దులు, పిల్లలు వెళ్లకుండా చూడాలని నగర ప్రజలను కోరారు. ఆపద సమయంలో జీహెచ్‌ఎంసీ హెల్ప్ నంబర్‌తో పాటు హైడ్రా హెల్ప్‌లైన్ నంబర్ 90001 13667ను సంప్రదించాలని మేయర్ విజయలక్ష్మి కోరారు.