
హైదరాబాద్: రక్తానికి సంబంధించి అనేక సమస్యలుంటాయి. రక్త క్యాన్సర్‌తో పాటు సికిల్ సెల్ డిసీజ్, థలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా.. ఇలాంటి అనేక సమస్యలకు రక్తమూలుగను (బోన్ మ్యారో) మార్చడం ఒక్కటే పరిష్కారం. అయితే అందులో చాలా సమస్యలుంటాయి. గతంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఉండడంతో ఎక్కువమంది పిల్లలు ఉండేవారు. అందువల్ల రక్తమూలుగ దాతల విషయంలో ఇబ్బంది అయ్యేది కాదు.
కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడంతో ఎవరికైనా అవసరమైతే అదే కుటుంబానికి చెందిన దాతలు దొరకడం కష్టం అవుతోంది. అలాంటప్పుడు 50 శాతం మ్యాచ్ ఉన్నా కూడా వైద్యరంగంలో వచ్చిన సరికొత్త పరిజ్ఞానంతో మూలుగ మార్పిడి విజయవంతంగా చేయొచ్చు. అలాంటి పరిజ్ఞానాన్ని కూడా కిమ్స్ ఆస్పత్రి సమకూర్చుకుంది. ఈ విషయాలను ఆస్పత్రికి చెందిన హెమటో ఆంకాలజీ, స్టెమ్ సెల్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగాధిపతి డాక్టర్ నరేందర్ కుమార్ తోట ఆస్పత్రిలో జరిగిన 10 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమంలో వివరించారు.
ఈ పదేళ్ల విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ఫిలాన్తరోపిస్ట్ లు శ్రీమతి సుధారెడ్డి, శ్రీమతి పింకీ రెడ్డిలు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డా. భాస్కర్ రావు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ డా. అభినయ్, మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డా. నరేంద్ర కుమార్ తోట మాట్లాడుతూ ‘‘రక్తమూలుగ మార్పిడి విషయంలో కిమ్స్ ఆస్పత్రి గణనీయమైన విజయాలు సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్‌లో ఈ తరహా చికిత్సలు మొదలుపెట్టిన మొట్టమొదటి ఆస్పత్రి ఇదే కావడం మా అందరికీ గర్వకారణం. రక్తమూలుగను మార్చడమే కాకుండా, ఆ తర్వాత కూడా రోగిని అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ చికిత్స విజయవంతం అయ్యేలా చూడడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ పదేళ్లుగా అత్యంత ఎక్కువ విజయాల శాతంతో ముందడుగు వేస్తున్నాం. ఈ విషయంలో జాతీయ సగటు కంటే కూడా కిమ్స్ ఆస్పత్రిలో విజయాల రేటు ఎక్కువ ఉండడం మాకు గర్వకారణం. ఇక్కడ ఉన్న నిపుణులు, ఉన్న అత్యాధునిక సదుపాయాలే అందుకు కారణం.
ఒకప్పుడు రక్తక్యాన్సర్ వచ్చినా, మరే సమస్య వచ్చినా రక్తమూలుగ మార్పించుకోవాలంటే రాయవెల్లూరులోని సీఎంసీకి, ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్‌లోనే అందుబాటులో అన్నిరకాల ఆధునిక చికిత్సలు వచ్చాయి. గడిచిన పదేళ్లలో 150 మందికి పైగా రోగులకు రక్తమూలుగ మార్పిడి చేసి, వారికి సత్ఫలితాలు అందించాం.
క్యాన్సర్ కేసుల్లో రక్తమూలుగ మార్పిడి 50 శాతం మ్యాచ్ అయినా చేయడం చాలా సులభమే. కానీ, సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా లాంటి కేసుల్లో అది చాలా కష్టం. మంచిఫలితాలు ఒక పట్టాన రావు. అయినా కూడా అలాంటి కేసులకు సైతం ఈ ఆస్పత్రిలో విజయవంతంగా రక్తమూలుగను మార్పిడి చేశాం. పెద్దలతో పాటు పిల్లలకూ ఇలాంటివి చేసి, మంచి ఫలితాలు సాధించాం. కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా పలు ఆఫ్రికన్ దేశాలు, గల్ఫ్ దేశాల రోగులకు కూడా ఇలాంటి 50% మ్యాచ్ ఉన్నప్పుడూ మార్పిడి చేశాం.
అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలోనే ఇక్కడ కూడా మార్పిడి చికిత్స చేస్తున్నా, ఇక్కడ ఇన్ఫెక్షన్ల రేటు ఎక్కువ ఉండడం అతిపెద్ద సమస్యగా ఉంటోంది. చికిత్స చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ల బారిన పడితే కోలుకోవడం కష్టమవుతుంది. వాటి బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు కార్యక్రమానికి గతంలో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నవారితో పాటు వారికి రక్తమూలుగను దానం చేసిన దాతలు కూడా రావడం ఎంతో సంతోషకరం. వీరంతా ముందుకొచ్చి మూలుగ దానం చేయడం వల్లే ఇంతమంది జీవితాలు ఇప్పుడు బాగున్నాయి. మరింతమంది ఈ విషయంలో అవగాహన పెంపొందించుకుని, రక్తమూలుగను దానం చేయడం ద్వారా మరికొందరి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం’’ అని డాక్టర్ నరేందర్ కుమార్ తోట తెలిపారు.