
ఔటర్‌పైఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్/ఇబ్రహీంపట్నం/మొయినాబాద్: బతుకుదెరువుకోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చారు. నిత్యం పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఆదిబట్ల పోలిస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లికి చెందిన కావలి బాల్‌రాజ్ (40) చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. వరంగల్ జిల్లా మాసంపల్లి తండాకు చెందిన మాలోతు చందులాల్ (29), ఏపీలోని విజయనగరం జిల్లా కలంరాజుపేటకు చెందిన జడ కృష్ణ (25) మొయినాబాద్‌లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌లో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వెదుళ్లవలసకు చెందిన దాసరి భాస్కర్‌రావు (39) డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా దాసరితండాకు చెందిన గుగులోతు జనార్దన్ (45) మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సోలార్ విల్లాస్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. బాల్‌రాజ్ నిర్వహిస్తున్న చికెన్ సెంటర్ వద్దకు వీరంతా తరచూ వస్తుండడంతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అందరూ స్నేహితులుగా మారారు. గురువారం రాత్రి బాల్‌రాజ్ సొంత కారు తీసుకొని ఐదుగురూ కలిసి యాదగిరిగుట్టకు వెళ్లారు. దర్శనం అనంతరం శుక్రవారం తెల్లవారు జామున ఘట్కేసర్ నుంచి మొయినాబాద్‌కు ఔటర్‌రింగ్‌రోడు మీదుగా వస్తుండగా బొంగ్లూర్ ఎగ్జిట్ 12కు సమీపంలో 108 కేఎం వద్దకు రాగానే నిద్రమత్తు, అతివేగంతో కారు డ్రైవింగ్ చేస్తున్న చందులాల్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. కారు ముందుభాగం లారీ వెనుకభాగంలో ఇరుక్కుపోవడంతో కారు నుజ్జునుజ్జయింది. జనార్దన్, చందులాల్, బాల్‌రాజ్, భాస్కర్‌రావు కారులోనే ఇరుక్కుపోయి దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. కృష్ణ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. చందులాల్‌కు జనార్దన్ వరుసకు బాబాయ్ అవుతాడు.
నుజ్జునుజ్జయిన కారు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం
మితిమీరిన వేగంతో లారీని ఢీకొన్న కారు
నలుగురు అక్కడికక్కడే దుర్మరణం
చికిత్స పొందుతూ మరొకరి మృతి