
కొత్వాల్ బన్‌గయా మేజిస్ట్రేట్
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా (ఎగ్జిక్యూటివ్) మారారు. పాతబస్తీలోని చెత్తబజార్‌లో ఉన్న కొత్వాల్ హౌస్‌లో కార్యనిర్వాహక న్యాయస్థానం నిర్వహించారు. మీర్‌చౌక్, కాలాపత్తర్, బండ్లగూడ, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ పోలీసులు తన ముందు ఉంచిన అంశాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రౌడీషీటర్లు, నేరస్తులతో పాటు అసాంఘిక శక్తులను మందలించారు. వాళ్లు ఇటీవల చేసిన నేరాలు, ఉల్లంఘఽనలను పరిగణనలోకి తీసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు ఉపేక్షించమని స్పష్టం చేశారు. మొత్తం ఎనిమిది గ్యాంగులకు సంబంధించిన కేసుల్ని విచారించిన ఆయన నగరంలో ఎవరైనా ప్రజా జీవితానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసినా, రౌడీ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూసేందుకు తనకు ఉన్న ఈ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను భవిష్యత్తులోనూ వినియోగిస్తానని చెప్పిన ఆనంద్ కేసుల్ని తదుపరి విచారణ కోసం వాయిదా వేశారు.
ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు నిర్వహించిన సీపీ ఆనంద్