
చెరువుల పునరుద్ధరణకు బతుకమ్మ కుంట ఓ రోల్‌మోడల్
అంబర్‌పేట: గ్రేటర్ పరిధిలో చెరువుల అభివృద్ధికి అంబర్‌పేట బతుకమ్మకుంట రోల్ మోడల్‌గా నిలుస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రాకు ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరితో కలిసి ఆయన బతుకమ్మకుంట అభివృద్ధిని పరిశీలించారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ తీరును పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించారు. చెరువుల పునరుద్ధరణ అవసరాలపై విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. బతుకమ్మకుంట పరిసర ప్రాంతాలు భావితరాలకు ఒక కానుకగా ఉంటాయన్నారు. రాబోయే బతుకమ్మ వేడుకలను ఇక్కడ పునరుద్ధరించిన చెరువులో నిర్వహించుకునేలా అందంగా ముస్తాబు చేస్తామన్నారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. తాను జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఇక్కడ చెత్త, ముళ్ల చెట్లు ఉండేవని, ప్రస్తుతం ఒక అందమైన నీటి చెరువుగా మార్చడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమలో జోనల్ కమిషనర్ రవికిరణ్, మాజీ ఎంపీ వీహెచ్, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.