భగాయత్‌లో కంపు కంపు! | - | Sakshi
Sakshi News home page

భగాయత్‌లో కంపు కంపు!

Jul 19 2025 1:13 PM | Updated on Jul 19 2025 1:13 PM

భగాయత్‌లో కంపు కంపు!

భగాయత్‌లో కంపు కంపు!

అధ్వానంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణ
● ఎటు చూసినా చెత్త కుప్పలే.. ● విజృంభిస్తున్న దోమలు..వైరల్‌ ఫీవర్లు ● ఆందోళనలో నివాసితులు

ఉప్పల్‌: చక్కటి లేఅవుట్‌..మంచి గ్రీనరీ, వెడల్పాటి రోడ్లతో ఆకర్షణీయంగా కన్పించే ఉప్పల్‌ భగాయత్‌ ఇప్పుడు కంపుమయంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ అటకెక్కడంతో చెత్త కుప్పగా మారింది. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందని స్థానికులు మండిపడుతున్నారు. కాలనీ అంతటా..రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త, భనవ నిర్మాణ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా కన్పిస్తున్నాయి. నెలల తరబడి వాటిని తరలించకపోవడంతో రోజురోజుకు కుప్పలు భవనాల ఎత్తును మించుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక వర్షాకాలం కావడంతో చెత్తకు వరద నీరు చేరి మురుగు మయం అవుతోంది. దీంతో దోమలు పెరిగి స్థానికులు నిద్రకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుంది?

ఉప్పల్‌ భగాయత్‌ పరిస్థితులను చూస్తే అసలు జీహెచ్‌ఎంసీ వ్యవస్థ ఉందా లేక నిద్రపోయిందా అనే అనుమానాలు కలగక మానదు. రోడ్లుకు ఇరువైపుల ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, భవన నిర్మాణ వ్యవర్థాలు గుట్టలు గుట్టలుగా పారబోస్తున్నా బల్దియా అధికారుల దృష్టికి రాకపోవడం విడ్డూరం.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన అతి పెద్ద హెచ్‌ఎండీఏ లే అవుట్‌ ఉప్పల్‌ భగాయత్‌. ఫేజ్‌–1, ఫేజ్‌–2లుగా విభిజించిన ఈ లేఅవుట్‌ 420 ఎకరాల పైమాటే. ఇప్పటికే రెండు వేలకు పైగానే కుటుంబాలు నివాసముంటున్నాయి. సంవత్సరానికి రూ.5 కోట్లకు పైగానే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. అదనంగా నిర్మాణాల అనుమతులతో సంవత్సరానికి దాదాపుగా రూ.3 వేల కోట్లకు పైగానే ఆదాయం వస్తోంది. అయినా కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌ భగాయత్‌లో వసతుల లేమిపై స్థానిక వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2024లోనే లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు స్థానిక కార్పొరేటర్‌ సైతం తన వంతుగా కృషి చేయగా జీహెచ్‌ఎంసీ ఉప్పల్‌ భగాయత్‌కు ప్రత్యేకంగా 21 మంది పారిశుద్ద్య సిబ్బందిని నియమించింది. వీరంతా ఫేజ్‌–1 ప్రధాన రోడ్లపైనే దృష్టి సారిస్తూ ఫేజ్‌–2లో గుర్తు వచ్చినప్పడు మాత్రమే వచ్చి కొంత మేర మాత్రమే రోడ్లు ఊడుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నెల రోజులు పడుతుంది..

ఉప్పల్‌ భగాయత్‌కు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలోనే 21 మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. ముందుగా ప్రధాన రహదారులు, ఆ తర్వాత అంతర్గత రోడ్లపై దృష్టి సారిస్తాం. రెండో ఫేజ్‌లోనూ పారిశుధ్ధ్య పనులు జరుగుతున్నాయి. బోనాల పండుగ దృష్ట్యా సిబ్బంది ఆ ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. అందువల్ల పారిశుద్ధ్య పనుల్లో కొంతమేర జాప్యం జరుగుతోంది. పెద్ద పెద్ద చెత్త కుప్పలను తొలగించేందుకు ఇంకా నెల రోజులు పట్టవచ్చు. ఈలోగా రోడ్ల శుభ్రతపై దృష్టి సారిస్తాం.

– రాజు, ఉప్పల్‌ డిప్యూటీ కమిషనర్‌

పట్టించుకునే నాథుడే లేడు..

అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ట్యాక్స్‌లు మాత్రం ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యంపై పట్టింపు లేదు. లోకాయుక్తలో కేసు వేస్తే గాని దిగి రాలేదు. అప్పటి నుంచి కొంత మంది సిబ్బందిని నామమాత్రంగా కేటాయించారు. ముందుగా పేరుకుపోయిన పెద్ద చెత్త కుప్పలను తొలగించేందుకు యంత్రాలు అవసరం. త్వరలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలుస్తాం.

– మేకల మధుసూదన్‌రెడ్డి, ఉప్పల్‌ భగాయత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement