
మండుతున్న ధరలు
సనత్‌నగర్: నగరంలో కూరగాయలు ధరలు మండుతున్నాయి. కిలో బెండకాయ రూ.55.. పచ్చిమిర్చి రూ.70.. బజ్జీమిర్చి రూ.70.. క్యాప్సికమ్ రూ.75.. గింజచిక్కుడు రూ.75.. బీన్స్ రూ.65.. గోకరకాయ రూ.45, పందిరిబీర రూ.38.. ఇవి కేవలం చౌకగా లభించే రైతుబజార్‌లో ధరలు మాత్రమే. ఇక బయట మార్కెట్లలో కూరగాయలు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుబజార్ కంటే ప్రతి కూరగాయ రకంపై అదనంగా రూ.10 నుంచి రూ.20 వెచ్చించాల్సిందే. ఖరీఫ్ సీజన్‌లో ఇటీవల కొత్త పంటలు వేయడంతో అవి చేతికి రావడానికి 50– 60 రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో కూరగాయల దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం కూరగాయల ధరలు కూడా పెరిగినట్లు ఎర్రగడ్డ రైతుబజార్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారానికొచ్చేసరికి నలుగురైదుగురు సభ్యులు ఉన్న కుటుంబం రూ.500 పెడితే గానీ వంట గదిలో కూరగాయల ఘుమఘుమలు ఉండడం లేదు. అలా నెలకొచ్చేసరికి రూ.2,000 కూరగాయలకే ఖర్చవుతుండడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం తప్పడం లేదు.
ఆగస్టు వరకు ఇంతేనా..
కొత్తగా వేసిన కూరగాయల పంటలు చేతికి రావాలంటే మరో నెల రోజులు పండుతుంది. అప్పటి వరకు కూరగాయల భారం తప్పేలా కనిపించడం లేదు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు నింగికి ఎగబాకగా, ఇంకోవైపు కూరగాయలు సైతం మేమేం తక్కువా? అన్నట్లు ధరలు పెరగడంతో సామాన్యుల బతుకు భారం కనాకష్టంగా మారింది. రైతుబజార్‌లోనే తక్కువగా దొరుకుతాయి కదా? అని వెళితే అక్కడ కూడా ధరలు ఎక్కువగా ఉంటుండడంతో చాలీచాలని విధంగా కూరగాయలను కొనుగోలు చేసి సర్దుకునే పరిస్థితి నెలకొంది. ఇక బహిరంగ మార్కెట్లో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎక్కడో దూరంగా ఉండే రైతుబజార్‌కు వెళ్లాలంటే దూరభారం కావడంతో వారాంతపు సంతలు గానీ, లేక సమీపంలోని కూరగాయల షాపుకు వెళ్లాల్సి రావడంతో అక్కడ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు వేతన జీవి ఆదాయం పెరగక.. మరోవైపు నిత్యావసర, కూరగాయల ధరలు ౖపైపెకి ఎగబాగుతుండడంతో నెలయ్యేసరికి జేబులు ఖాళీ అయ్యి చేతులు చాచాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
దిగుబడులు తగ్గడం వల్లే..
నెల రోజులుగా పంట దిగుబడి సరిగా లేకపోవడంతో ధరలు కూడా పెరిగాయి. వేసిన కొత్త పంటలు కోతకు రావాలంటే మరికొంత సమయం పడుతుంది. ఆగస్టు వరకు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
– రమేష్, ఎర్రగడ్డ రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్
రైతుబజార్‌లో నెల రోజుల వ్యవధిలో పెరిగిన ధరలు (రూ.లలో)
కిలో, జూన్ 17, జులై 17
బెండకాయ, 35, 55
పచ్చిమిర్చి, 45, 70
బజ్జీ మిర్చి, 23, 70
క్యాప్సికమ్, 55, 75
బీన్స్, 55, 65
గింజచిక్కుడు, 60, 75
గోకరకాయ, 35, 45
టమాటా, 21, 27
వంకాయ, 22, 28