
టమాటా లారీ బోల్తా
రాజేంద్రనగర్: ప్యాసింజర్ ఆటో అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో డీసీఎం పుట్‌పాత్‌ను ఢీ కొనడంతో వాహనం బోల్తా పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గంగాధర్ డీసీఎంలో ప్రతిరోజు నగరంలోని కూరగాయల మార్కెట్‌లకు కూరగాయలను సరఫరా చేస్తుంటాడు. గురువారం ఉదయం డీసీఎంలో టమాటా లోడ్ తీసుకొని ఆరాంఘర్ మీదుగా గుడిమల్కాపూర్ వెళుతుండగా రాజేంద్రనగర్ పీడీపీ చౌరస్తా 215 పిల్లర్ వద్దకు రాగానే ప్యాసింజర్ ఆటో రాంగ్ రూట్‌లో దూసుకొచ్చింది. దానిని తప్పించే క్రమంలో డీసీఎం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. డీసీఎంలోని టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. డ్రైవర్ గంగాధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కారణంగా దాదాపు గంటసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ ద్వారా డీసీఎంను పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. డీసీఎం యజమాని ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టమాటాలు ఎత్తుకెళ్లిన స్థానికులు...
రోడ్డుపై టమాటలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఉదయం వాకింగ్‌కు వచ్చిన వారితో స్థానికులు, వాహనదారులు టమాటాలను ఎత్తుకెళ్లారు. అందిన కాడికి సంచులు, ప్లాస్టిక్ కవర్లలో తీసుకుని ఉడాయించారు.