గచ్చిబౌలి: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల పట్టణానికి చెందిన వలివేటి హితేష్(29) కోకాపేట్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ మణికొండలోని లాంకో హిల్స్‌లో తన సోదరుడు ప్రమోద్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమోద్ డ్యూటీకి వెళ్తుండగా హితేష్ తన ఆరోగ్యం సరిగా లేదని తర్వాత వస్తానని చెప్పాడు. సాయంత్రమైనా అతను ఆఫీసుకు రాకపోవడంతో ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చి స్నేహితుడిని ఇంటికి వెళ్లి చూడాలని కోరాడు. దీంతో అతను అక్కడికి వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో ప్రమోద్‌కు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి వచ్చిన ప్రమోదు స్నేహితుల సహాయంతో తలుపులు విరగొట్టి చూడగా హితేష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. సారీ నేను చనిపోతున్నా.. అందరూ జాగ్రత్తగా ఉండాలి.. నా చావును మీడియాలో చూపించవద్దని రాసిన లేఖను గుర్తించాడు. రెండేళ్లుగా ప్రేమిస్తున్న యువతితో మనస్పర్థలు రావడంతో మనస్తాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.