
డీసీలు, జడ్‌సీలకు
‘ఇన్‌స్టంట్’ అనుమతుల రద్దు అధికారం
స్టాండింగ్ కమిటీ సమావేశంలో 16 అంశాలకు ఆమోదం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అజెండాలోని 14 అంశాలు, టేబుల్ అజెండాలోని 2 అంశాలు కలిపి మొత్తం 16 అంశాలకు గురువారం ఆమోదం లభించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆమోదం పొందిన ముఖ్యాంశాలిలా..
జీహెచ్‌ఎంసీలో ‘ఇన్‌స్టంట్’ భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి సర్కిళ్లలో వర్క్ కమెన్స్‌మెంట్ లెటర్ ఇవ్వకముందే తప్పులున్నట్లు గుర్తిస్తే అనుమతులు రద్దు చేసే అధికారం డిప్యూటీ కమిషనర్లకు అప్పగించడం. వర్క్ కమెన్స్‌మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత అయితే రద్దు చేసే అధికారం జోన ల్ కమిషనర్లకు ఇవ్వడం. అనుమతుల్లేకుండా ని ర్మించిన భవనాలను సెక్షన్ 455–ఎ కింద రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు అందిన దరఖాస్తుల పరిశీ లన అధికారం జోనల్ కమిషనర్లకు అప్పగించడం.
● సరూర్‌నగర్ పెద్ద చెరువు ప్రధాన కట్ట మరమ్మతులు, బలోపేతం చేసే పనుల కోసం రూ. 5.60 కోట్ల అంచనా వ్యయంతో షార్ట్ టెండర్ పిలిచేందుకు పరిపాలన అనుమతి. జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు బుద్ధభవన్‌లో హైడ్రా కార్యాలయానికి మూడేళ్ల వరకు(19 ఆగస్ట్ 2024 నుంచి 18 ఆగస్ట్ 2027 వరకు) లీజు కిచ్చేందుకు ఆమోదం. శాస్త్రి పురం ఆర్‌ఓబీ నుండి ఇన్నర్ రింగ్ రోడ్డు (మెహఫిల్ హోటల్) వరకు రూ. 4.95 కోట్ల అంచనా వ్యయంతో 100 అడుగుల రోడ్డు విస్తరణ.
● వనస్థలిపురం నుంచి వయా సాహెబ్ నగర్ మీదుగా ఓల్డ్ హయత్ నగర్ వరకు మిస్సింగ్ లింక్‌రోడ్ కింద రోడ్డును 24 అడుగులకు వెడల్పు చేయడంతో పాటు మాస్టర్‌ప్లాన్‌లో చేర్చేందుకు ప్రభుత్వానికి తెలియజేయడం. తద్వారా 102 ఆస్తులపై ప్రభావం పడనుంది. కమిషనర్ అధికారాల్లో కొన్ని అడ్మిన్, ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్లకు బదలాయింపు. హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్ పథకం ప్రారంభించేందుకు ఆమోదం. టిఫిన్ ధర రూ.19 లు కాగా, లబ్ధిదారులు చెల్లించే రూ.5లు పోను మిగతా రూ.14 జీహెచ్‌ఎంసీ చెల్లించనుంది. అందుకు జీహెచ్‌ఎంసీకి ఏటా దాదాపు రూ.15.33 కోట్లు ఖర్చు కానుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటుకు (కంటైనర్లకు)రూ. 11.43 కోట్లు ఖర్చు కానుంది. దానికి కూడా ఆమోదం లభించింది. తొలుత మింట్‌కాంపౌండ్, గౌలిదొడ్డి, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. 23 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్వహణను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలిచేందుకు ఆమోదం.
స్టాండింగ్ సమావేశంలో కమిషనర్, మేయర్