
డీఎన్‌ఏ పరీక్షలకు ఆనవాళ్లు లేవు!
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలోని అలబామాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవదహనమైన హైదరాబాదీ కుటుంబానికి సంబంధించి అక్కడి అధికారులు డీఎన్‌ఏ నమూనాలు కూడా సేకరించలేకపోయారు. అగ్నికీలలు నలుగురి మృతదేహాలను పూర్తిగా కాల్చేయడంతో ఇది సాధ్యం కాలేదు. దీంతో అమెరికన్ అథారిటీస్ ఆయా పరిస్థితులతో పాటు కారు వివరాల ఆధారంగా మృతులను ధ్రువీకరించారు. వీరి అంత్యక్రియలు శుక్రవారం అమెరికాలోని అట్లాంటాలో జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్, గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్ బెజుగంకు (40), జీడిమెట్లకు చెందిన తేజస్వి చోల్లెటితో (36) 2013లో వివాహం జరిగింది. వీరికి సిద్ధార్థ్ (9), మృద (7) సంతానం. ఐటీ ప్రొఫెషనల్స్ అయిన వారు మూడేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. పశుపతినాథ్ కుటుంబం ప్రస్తుతం కొంపల్లిలోని ఎన్సీఎల్‌లో ఉంటోంది. ఇటీవలే వీరు తమ కుమారుడి వద్దకు అమెరికా వెళ్లారు. వెంకట్ కుటుంబం డాలస్ సమీపంలోని సట్టన్ ఫీల్డ్స్ కమ్యూనిటీలో నివసిస్తోంది. అతడి సోదరి దీపిక అట్లాంటాలో ఉంటున్నారు. గత వారం తన తల్లిదండ్రులతో కలిసి వెంకట్ కుటుంబం సోదరి వద్దకు వెళ్లింది. శనివారం వీరంతా సట్టన్ ఫీల్డ్స్‌కు తిరుగు ప్రయాణం కాగా... వెంకట్ కుటుంబం కారులో, అతడి తల్లిదండ్రులు విమానంలో బయలుదేరారు. అక్కడి కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 10.17 గంటల ప్రాంతంలో కారు అలబామాలోని గ్రీన్ కౌంటీలో ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో రాంగ్ రూట్‌లో వచ్చిన మినీ ట్రక్కు వీరి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారుకు నిప్పంకుకోవడంతో వెంకట్ కుటుంబం సజీవ దహనమైంది. విమానంలో డాలస్ చేరుకున్న అతడి తల్లిదండ్రులు ఎంతకూ తమ కుమారుడి కుటుంబం ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా ప్రమాద విషయం తెలిసింది. అలబామా అధికారులు తొలుత డీఎన్‌ఏ, ఆపై దంతాల నమూనాలు సేకరించడం ద్వారా వెంకట్ సహా నలుగురి గుర్తింపును ధ్రువీకరించాలని భావించారు. అయితే నమూనాలు సైతం సేకరించలేని విధంగా మృతదేహాలు కాలిపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో అప్పటి పరిస్థితిలతో (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్) పాటు కారు రిజిస్ట్రేషన్ వివరాలు, అందులో లభించిన మృతదేహాల సంఖ్య తదితరాలను పరిగణలోకి తీసుకుంటూ మృతులను గుర్తించారు. మృతదేహాలను గురువారం కుటుంబీకులకు అప్పగించారు. శుక్రవారం అట్లాంటాలో వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వెంకట్ తల్లిదండ్రులు అమెరికాలోనే ఉండగా.. తేజస్విని తల్లిదండ్రులు మంగళవారం బయలుదేరి వెళ్లారు.
డాలస్ ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం మృతి
శనివారం ట్రక్కు ఢీకొట్టడంతో కారులో సజీవదహనం
ప్రత్యామ్నాయాల ఆధారంగా ముందుకెళ్లిన అధికారులు
కారు వివరాలు, ఇతర అంశాలతో మృతుల ధ్రువీకరణ
శుక్రవారం అట్లాంటాలో వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు
ఏమిటీ డీఎన్‌ఏ పరీక్షలు..?
మొన్న అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం... నిన్న సంగారెడ్డిలో సిగాచీ పరిశ్రమలో పేలుడు... తాజాగా అమెరికాలో సజీవదహనమైన హైదరాబాదీ కుటుంబం.... ఈ మూడు సందర్భాల్లోనూ తెరపైకి వచ్చి వాటిలో సారూప్యత కలిగిన అంశం డీఎన్‌ఏ పరీక్షలు. రూపు కోల్పోయిన మృతదేహాలను గుర్తించడానికి ఈ విధానాన్ని వినియోగిస్తారు. ప్రతి వ్యక్తి శరీరంలో ఉండే కణాల్లో డీఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ (డీఎన్‌ఏ) అనే రసాయనం ఉంటుంది. ఇది ఆ శరీర నిర్మాణం, లక్షణాలు, వంశపారంపర్య సమాచారం తదితర వివరాలు కలిగి ఉంటుంది. డీఎన్‌ఏ పరీక్షలు చేయడానికి ముందు ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహం నుంచి ఎముకలు, వెంట్రుకలు, దంతాలు లేదా సాఫ్ట్ టిష్యూల్లో ఏదో ఒకటి సేకరిస్తారు. దీనిని పోల్చడానికి ఒక రిఫరెన్స్ నమూనా అవసరం ఉంటుంది. దీన్ని తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు తదితరుల నుంచి సేకరిస్తారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో పరీక్షించడం ద్వారా రెండింటిలో ఉన్న డీఎన్‌ఏ ఒకటేనా? కాదా? అనేది తేలుస్తారు. మృతదేహాల గుర్తింపుతో పాటు పిల్లల విషయంలో భార్యాభర్తలు లేదా బంధువుల మధ్య ఏర్పడే సందేహాలను నివృత్తి చేయడానికీ డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో పుట్టిన ప్రతి వ్యక్తికీ సంబంధించిన డీఎన్‌ఏ, జినోన్ సీక్వెన్సింగ్‌లతో డేటా బ్యాంక్ ఏర్పాటు చేస్తుంటారు.