
నెల రోజుల్లో 25 మంది అరెస్టు
బాధితులకు రూ.3.67 కోట్లు రిఫండ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత నెలలో వివిధ సైబర్ నేరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్లు నిర్వహించారు. ఆయా కేసుల్లో బ్యాంకు ఖాతాలు అందించిన, సమకూర్చిన వారితో పాటు దళారులతో కలిపి మొత్తం 25 మందిని అరెస్టు చేశారు. మరోపక్క నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయిన మొత్తంలో రూ.3.67 కోట్లు బాధితులకు రిఫండ్ చేయించారు. పట్టుబడిన నేరగాళ్లపై దేశ వ్యాప్తంగా 453 కేసులు నమోదై ఉండగా.. రాష్ట్రంలోని వాటి సంఖ్య 66గా ఉంది. వారి నుంచి 34 మొబైల్ ఫోన్లు, 20 చెక్‌బుక్స్, 17 డెబిట్ కార్డులు, 8 సిమ్‌కార్డులు, 16 బ్యాంక్ పాస్‌పుస్తకాలతో పాటు రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. చైల్డ్ పోర్న్ వీడియోల కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. ఆయా నిందితులు నివసించే ప్రాంతాల్లోని ఠాణాలకు ఈ కేసులను బదిలీ చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
పబ్‌లపై ఈగల్ నిఘా
సాక్షి, సిటీబ్యూరో: కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని, డ్రగ్ పెడ్లర్ సూర్య అరెస్టుతో సైబరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఈగల్ టీం అప్రమత్తమైంది. సూర్య అరెస్టుతో నగరంలోని పలు పబ్‌లలో డ్రగ్ లింకులు బయటపడటంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ నెల 7న సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రమేష్ రెడ్డికి సూర్య తన రెస్టారెంట్‌కు టాటా స్కార్పియో వాహనంలో మాదకద్రవ్యాలతో వస్తున్నాడని సమాచారం అందడంతో తన బృందంతో మల్నాడు రెస్టారెంట్ సమీపంలో నిఘా పెట్టారు. అతడి వాహనాన్ని తనిఖీ చేయగా 3.2 గ్రాముల ఓజీ వీడ్, 1.6 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు, 10 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో కొంత భాగాన్ని కొరియర్ ద్వారా డెలివరీ చేసిన ఒక మహిళ పాదరక్షల్లో దాచి పెట్టారు. విచారణ సమయంలో సూర్య హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్బులలో నిర్వహించే పార్టీల ద్వారా క్రమం తప్పకుండా డ్రగ్స్ సేవించి పంపిణీ చేస్తున్నట్లు అంగీకరించాడు. వీటిల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్, జూబ్లీహిల్స్‌లోని ఫార్మ్ పబ్, మాదాపూర్‌లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22 వంటివి ఉన్నాయి. ఆయా పబ్‌లలో డ్రగ్స్‌ను ఉపయోగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, నైజీరియా, ఢిల్లీలోని ఇతర ప్రాంతాల నుంచి విదేశీ డ్రగ్ పెడ్లర్ల నుంచి డ్రగ్స్ సేకరించి, పార్టీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో పబ్ యజమానులు రాజా శ్రీకర్, పృథ్వీ వీరమాచినేని, రోహిత్ మెడిశెట్టిల ప్రమేయం ఉన్నట్లు సూర్య పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో ఆయా పబ్‌లపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. వాటి యజమానులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణ కోసం యజమానులను సమన్లు జారీ చేశారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
చైన్ స్నాచర్ల ఆటకట్టు
అమీర్‌పేట: వారిద్దరూ స్నేహితులు.. బీటెక్ చదువుతున్నప్పటినుంచే చైన్ స్నాచింగ్‌లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం నగరంలో ఉంటూ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా తమ వైఖరి మార్చుకోలేదు. ఎస్‌ఆర్‌నగర్‌లో స్నాచింగ్‌కు పాల్పడగా 24 గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ టి.గోవర్ధన్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు లీలా కృష్ణ ప్రసాద్, కోల దినేష్ స్నేహితులు. 2021లో వారు బీటెక్ చదువుతుండగానే గుంటూరులో మూడు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ టెక్ మహీంద్రలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, దినేష్ అమీర్‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. ఇద్దరూ కలిసి ఎస్‌ఆర్‌నగర్‌లోని గౌతమి గ్రాండ్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నారు. బుధవారం ఉదయం వారు బైక్‌పై బంజారాహిల్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. మధ్యాహ్నం ఎస్‌ఆర్‌నగర్ బీకేగూడలోని ఓ టీ స్టాల్ వద్దకు చేరుకున్నారు. దినేష్ అక్కడే నిల్చుండగా కృష్ణ ప్రసాద్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని 5 తులాల పుస్తెల తాడు లాక్కెళ్లాడు. అనంతరం ఇద్దరు బైక్‌పై పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి వారి బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన వీరు స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ రాఘవేంద్రరావు, ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి,డీఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
● తరచూ డ్రగ్స్ పార్టీల నిర్వహణ
● పెడ్లర్ సూర్య అరెస్టుతో వెలుగులోకి అనేక అంశాలు
● పలు పబ్‌లు, రెస్టారెంట్ల యజమానులకు నోటీసులు
బీటెక్ చదువుతున్నప్పటినుంచేస్నాచింగ్‌లు
నిందితుల్లో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్