
స్నాచర్లు, పిక్ ప్యాకెటర్ల కళ్లు వీటిపైనే
● ఏటా వేల సంఖ్యలో ఫోన్లు గల్లంతు
● బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల్లో పంజా
● 12 గంటల్లో 19 నేరాలు చేసిన ముఠాలు
● వీటిలో 13 ఉదంతాలు ఫోన్ల తస్కరణవే
సాక్షి, సిటీబ్యూరో: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరిగిన బుధవారం జేబుదొంగలు రెచ్చిపోయారు. భక్తుల మాదిరిగానే తిరుగుతూ క్యూలైన్లు, ప్రవేశ ద్వారాల వద్ద చేతివాటం చూపించారు. కేవలం 12 గంటల్లో మొత్తం 19 కేసులు నమోదు కాగా... వీటిలో 13 సెల్‌ఫోన్ చోరీలకు సంబంధించినవే కావడం గమనార్హం. కేవలం ఈ ఒక్క సందర్భంలోనే కాదు... గడిచిన కొన్నాళ్లుగా నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న పోలీసులు ప్రస్తుతం పిక్‌పాకెటర్ల కన్ను సెల్‌ఫోన్లపై ఉన్నట్లు చెబుతున్నారు.
అంతటా ఇవే నేరాలు..
రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నా, రద్దీ బస్సులో ప్రయాణిస్తున్నా, మార్కెట్‌కు వెళ్లినా, సభలు, ఉత్సవాలకు హాజరైనా అక్కడ పొంచి ఉంటున్న చోరులు స్పార్ట్ ఫోన్లను స్వాహా చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వాళ్లు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. అధికారిక, అనధికారిక సమాచారం ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేల వరకు సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. రాజధాని నగరంలో అనేక ఛోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయా ణికులు, పాదచారులతో పాటు రద్దీ ప్రాంతాల్లోని వాళ్లే లక్ష్యంగా చేసుకుని ఈ సెల్‌ఫోన్ నేరం అనేది కొనసాగుతోంది. వీరిబారిన పడే వారిలో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు.
పర్సులు, గొలుసుల నుంచి సెల్‌ఫోన్ల వైపు..
నగరంలోని పిక్ ప్యాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే.. ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తర్వాత వీరి పంఽథా మారింది. గతంలో చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ వరుసపెట్టి పంజా విసిరాయి. ఎక్కడిక్కడ ఆడా, మగా అని తేడా లేకుండా గొలుసులు తెంచుకుపోయాయి. అయితే.. ఇటీవల పిక్ ప్యాకెటర్లు పర్సుల్ని, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్‌ఫోన్లపై పడ్డారు. కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు చేస్తున్నారు. వ్యవస్థీకృతం కాని, నేరం చేయాల్సి అవసరం లేని.. సరదా కోసం చేస్తున్న వారి సంఖ్యా ఇటీవల పెరుగుతోంది. ఈ నేరగాళ్లు సరదా కోసం సెల్‌ఫోన్లు లాక్కుపోతూ స్నాచింగ్, దోపిడీ కేసుల్లో నిందితులుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
కొన్నిసార్లు ఇన్సూరెన్స్ క్‌లైమ్‌కి ఇబ్బందే..
ఓ బాధితుడు పోలీసులకు ఆశ్రయించి ఎలాంటి ఫిర్యాదు చేసినా దాన్ని జీడీ ఎంట్రీ చేసి... ఆపై ఎఫ్‌ఐఆర్‌గా రిజిస్టర్ చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం దీనికి న్యాయపరమైన సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు దీన్ని పూర్తిగా అమలు చేయట్లేదు. ముఖ్యంగా జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్‌ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఆ ఫోన్ ఖరీదు చేసినప్పటి బిల్లు తదితరాలు లేకపోతే ఈ ఫిర్యాదు సాధ్యం కావట్లేదు. ఇలాంటి సందర్భాల్లో, ఆ ఫోన్ రికవరీ కానప్పుడు బాధితులు నష్టపోతున్నారు.