
గృహమస్తు!
ఇందిరమ్మ ఇళ్ల కోసం స్లమ్ మ్యాపింగ్
● ఎంపిక చేసిన ఐదు ప్రాంతాల్లో జీఐఎస్‌తో..
● కన్సల్టెన్సీ సేవలకు టెండరు
● కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపిక చేసిన స్లమ్స్‌లో జీ+3 అంతస్తులుగా గృహ నిర్మాణం చేసేందుకు జీహెచ్‌ఎంసీ సమాయత్తమవుతోంది. నగరంలోని స్లమ్స్‌లో ఎక్కడ ఉంటున్న వారికి అక్కడే వీటిని నిర్మించడంతో పాటు, ఎక్కడా ఎలాంటి ఇళ్లు లేని పేదలకు సైతం వీటిలో సదుపాయం కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకుగాను తొలుత ప్రయోగాత్మకంగా మాదన్నపేటలోని సరళాదేవినగర్, సైదాబాద్‌లోని పిల్లిగుడిసెలు, మారేడ్‌పల్లిలోని అంబేడ్కర్ నగర్ సహా ఐదు ప్రాంతాల్లోని స్లమ్స్‌ను జీఐఎస్ బేస్డ్ సర్వే చేయించనున్నారు. దాంతోపాటు స్లమ్స్ డెవలప్‌మెంట్ లేదా రీ డెవలప్‌మెంట్ కోసం అవసరమైన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు, లే ఔట్ ప్లాన్స్ కోసం కన్సల్టెన్సీ సర్వీసులను ఆహ్వానించారు. వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్ల మోడల్‌కు అనుగుణంగా తగిన డిజైన్లు, డ్రాయింగులు, అంచనా వ్యయం కూడా ఎంపికయ్యే కన్సల్టెన్సీ సంస్థే రూపొందించాల్సి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (యు) నిధులను కూడా వినియోగించుకొని అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లను నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేసే నిధులతో పాటు, అవసరమైన మిగతా నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. స్లమ్స్ మ్యాపింగ్, డిజైన్లు పూర్తయ్యాక, వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆమోదం పొందాక ఇళ్ల నిర్మాణాలు చేపడతారు. ఎంపిక చేసిన స్లమ్స్‌తో పాటు గ్రేటర్‌లో ఖాళీగా ఉన్న ప్రదేశాలను కూడా గుర్తించి ఈ పథకాల ద్వారా ఇళ్ల నిర్మాణం చేయనున్నారు.
స్థలాల్లేని వారే ఎక్కువ..
నియోజక వర్గానికి ఏటా 3,500 ఇందిరమ్మ ఇళ్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. నగరంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 10.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అందజేస్తుండగా, నగరంలో అలా స్థలం ఉన్న వారు దాదాపు పదిశాతం మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 90 శాతం మందికి ఎలాంటి స్థలం లేదు. ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వ స్థలాల్లో బహుళ అంతస్తులతో ఇళ్లు నిర్మించాలని భావించిన ప్రభుత్వం, వాటితోపాటు స్లమ్స్‌లో ఉంటున్న దరఖాస్తుదారులకు వాటిని కూల్చేసి వారుంటున్న ప్రాంతాల్లోనే జీ+3 అంతస్తులుగా నిర్మించాలని భావించింది. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం కన్సల్టెన్సీ సేవలను ఆహ్వానించింది. కన్సల్టెన్సీ సేవల కింద మొత్తం ప్రాజెక్టులో ఎంతశాతం కావాలో పేర్కొనాల్సిందిగా ఏజెన్సీలకు సూచించింది. ఎంపికయ్యే ఏజెన్సీలు ఏడాది పాటు సేవలందించాలి. అవసరమైతే ఇందిరమ్మ ఇళ్లు.. పీఎంఏవై కింద చేపట్టే వీటి నిర్మాణం పూర్తయ్యేంత వరకు సేవలందించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 8న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు. బిడ్ దాఖలుకు ఈ నెల 18 వరకు గడువు ఉంది.