ఫ్రిడ్జ్‌ పేలి గృహోపకరణాలు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఫ్రిడ్జ్‌ పేలి గృహోపకరణాలు దగ్ధం

Jul 4 2025 6:57 AM | Updated on Jul 4 2025 6:57 AM

ఫ్రిడ్జ్‌ పేలి గృహోపకరణాలు దగ్ధం

ఫ్రిడ్జ్‌ పేలి గృహోపకరణాలు దగ్ధం

అమీర్‌పేట: ఫ్రిడ్జ్‌ పేలి ఇంట్లోని వస్తువులు కాలిపోయిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సనత్‌నగర్‌ రాజరాజేశ్వరీనగర్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన రవి భార్య, కుమారుడితో కలిసి రాజరాజేశ్వరి నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం భార్యా, భర్తలు నీళ్లు తెచ్చేందుకు కిందకు వెళ్లగా మూడో అంతస్తులోని వారి ఇంట్లో ఫ్రిడ్జ్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో పేలిపోయింది. మంటలు ఇంట్లో ఉన్న సామగ్రికి వ్యాపించడంతో కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందా లేక ఫ్రిడ్జి కంప్రెషర్‌ పేలి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉందని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

రబ్బర్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

మైలార్‌దేవ్‌పల్లి: షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా కాటేదాన్‌లోని ఓ రబ్బర్‌ పరిశ్రమలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌కు చెందిన అనిల్‌సురేఖ కాటేదాన్‌లోని నేతాజీనగర్‌లో రబ్బర్‌ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఉదయం 4 గంటల ప్రాంతంలో పరిశ్రమ నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు రెండు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వికలాంగులు, ఆసరా పెన్షన్లు పెంచాలి

హిమాయత్‌నగర్‌: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని వికలాంగుల, ఆసరా పెన్షన్‌ దారుల పెన్షన్లు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌తో ఆగస్టు 13న ఎల్‌బీ స్టేడియంలో వికలాంగుల, ఆసరా పెన్షన్‌ దారుల మహాగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం బషీర్‌బాగ్‌ దేశోద్దారక భవన్‌లో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోగా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్‌న్స్‌ జారీ చేయాలన్నారు. వికలాంగుల పెన్షన్లను రూ.6 వేలు, ఇతర ఆసరా పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలన్నారు. తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వికలాంగులకు రూ.15 వేల పెన్షన్‌ మంజూరు చేయాలన్నారు. పెన్షన్ల పెంపుదల కోసం జూలై 7న విహెచ్‌పిఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పించనున్నట్లు తెలిపారు. జూలై 9న 33 జిల్లాల్లో విహెచ్‌పిఎస్‌, ఎమ్మార్పీఎస్‌ సంఘాల కార్యాచరణ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జూలై 10, 11, 12వ తేదీలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. సమావేశంలో నాయకులు ఎల్‌.గోపాల్‌ రావు, అందె రాంబాబు, సామినేని భవానీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

సికింద్రాబాద్‌: మానసిక సమస్యలతో బాధపడతున్న బీటెక్‌ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఘట్‌కేసర్‌–బీబీనగర్‌ రైల్వేస్టేషన్ల చోటు చేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ పండరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా, బెల్లెపల్లికి చెందిన చీర సాయిప్రకాశ్‌ (22) నగరంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న అతను బుధవారం రాత్రి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం స్వాధీనం

కాచిగూడ: గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నరేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ, కృష్ణానగర్‌ నాలాలో గుర్తుతెలియని వ్యక్తి (45) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement