
చేప ప్రసాదం పంపిణీకి సిద్ధమవుతున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్
అబిడ్స్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రసాద పంపిణీకి అన్ని శాఖల వారీగా ఏర్పాట్లు వేగిరమయ్యాయి. ఈ నెల 8న ఉదయం నుంచి 9వ తేదీ ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణి చేయనున్నారు. పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, వాటర్ బోర్డు, విద్యుత్, రెవెన్యూ, రవాణా, మత్స్య తదితర ప్రభుత్వ శాఖలతో అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించి చేప ప్రసాదం పంపిణీకి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బారికేడ్లు, షెడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి.
భారీ బందోబస్తు: ఏసీపీ ప్రవీణ్ కుమార్
ఈ సందర్భంగా 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అబిడ్స్ డివిజన్ ఏసీపీ పి.ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా చేడతామన్నారు. అబిడ్స్, బేగంబజార్ పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో పాటు సెంట్రల్‌జోన్ సిబ్బంది, ఇతర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల సహాయం కూడా తీసుకుంటామన్నారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు జీఎం జాన్ షరీఫ్ తెలిపారు.

చేప ప్రసాదం పంపిణీకి సిద్ధమవుతున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్