
దక్షిణాసియాలోనే తొలి నగరంగా రికార్డు..
మూసీ నది దక్షిణ ఒడ్డున సరికొత్త ఆధునిక ఎస్‌బీఆర్ సాంకేతికతతో నిర్మించిన నాగోలు ఎస్టీపీ దేశంలోనే అతి పెద్దది. ఇప్పటి వరకు ఎస్టీపీలకు యూఏఎస్‌బీ, ఎంబీబీఆర్, ఈఏబీఎన్‌ఆర్ టెక్నాల జీ వినియోగించగా.. సరికొత్త ఎస్‌బీఆర్ టెక్నాలజీతో సుమారు రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 320 ఎమ్మెల్డీ సామర్థ్యం గల ఎస్టీపీని 15 ఎకరాల్లో నిర్మించారు. ఇటీవల వాటర్ డైజెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ యునెస్కో భాగస్వామ్యంతో 2024 –2025 సంవత్సరానికి గాను ప్రభుత్వ కేటగిరీలో ఉత్తమ ఎస్టీపీగా నాగోలు ఎంపిక చేసి జలమండలికి వరల్డ్ వాటర్ అవార్డు ప్రదానం చేసింది. పర్యావరణ అనుకూలత, సమర్థ మురుగు నీటి శుద్ధి, నీటి పునర్వినియోగం, ఆరోగ్యకర వాతావరణాన్ని అందిస్తున్నందుకు ఉత్తమ ఎస్టీపీగా ఎంపిక చేసింది.
మురుగు నీటి పరిస్థితి ఇలా..
● హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజువారీగా 1,950 మిలియన్ లీటర్ గ్యాలన్ల (ఎమ్మెల్డీ) మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,650 ఎమ్మెల్డీ ఉంటుంది. జలమండలి ఇప్పటికే 37 ఎస్టీపీల ద్వారా 1,444 ఎమ్మెల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. మరో 322 ఎమ్మెల్డీ సామర్థ్యం గ ల ఐదు ఎస్టీపీలు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ట్రయల్ రన్ దశలో ఉండగా.. సుమారు 113.5 ఎమ్మెల్డీ సామర్థ్యంగల మూడు ఎస్టీపీల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే దాదాపు 1,878 ఎమ్మెల్డీల మురుగు శుద్ధి చేయవచ్చు. మిగిలిన 72 ఎమ్మెల్డీల మురుగును శుద్ధి చేయాల్సి అవసరం ఉంటుంది.
● గత ప్రభుత్వం వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంతో సుమారు రూ.3,866.21 కోట్ల వ్యయంతో 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధం కాగా.. స్థలాల సేకరణ, ఇతరత్రా కారణాలతో వాటి సంఖ్యను ఇరవై ఎస్టీపీలకు కుదించినా సామర్థ్యం తగ్గకుండా పనులు పూర్తి చేసింది. అందులో ఇప్పటికే 12 ఎస్టీపీలు మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, మరో ఎనిమిది ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
హ్యామ్ మోడ్‌లో అమృత్ ఎస్టీపీలు
కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0 పథకం కింద మంజూరైన 39 ఎస్టీపీలు హ్యామ్ మోడ్‌లో నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో నిర్మాణ పనులకు సిద్ధమవుతున్నాయి. మొత్తం ఎస్టీపీల్లో ఒకటి పీపీపీ మోడ్‌లో.. మిగిలిన 38 హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్)విధానంలో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే 972 ఎమ్మెల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. వాటి నిర్మాణ పనులు రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలును, ప్యాకేజీ–2లో 22 ఎస్టీపీలు నిర్మిస్తారు. నిర్మాణ సంస్ధ ఎస్టీపీలను నిర్మించి 15 ఏళ్లపాటు నిర్వహణకు చేపట్టనుంది.
మూసీపై ఎస్టీపీల ప్రతిపాదన
● హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మూసీ నదిపై సుమారు 62 ఎస్టీపీల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన సమర్పించింది. మహా నగరంలోని 80 శాతం మురుగు మూసీ నదిలోకి చేరుతోంది. మిగిలిన 20 శాతం స్థానిక చెరువుల్లో కలుస్తోంది. నగరంలో మూసీ నది సుమారు 55 కి.మీ మేర ప్రవహిస్తుండటంతో దానికిరువైపులా మురుగు కలుస్తోంది. రాబోయే పదేళ్లలో విస్తరించే హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 2,815 ఎమ్మెల్డీల మురుగు నీరు ఉత్పన్నం కావచ్చని జలమండలి అంచనా వేసింది. దీంతో మూసీపై మురుగు నీటి శుద్ధి కోసం ఎస్టీపీలను ప్రతిపాదించింది.
● ప్రస్తుతం మహానగరంలో 9,769 కిలో మీటర్లు మాత్రమే సీవరేజీ పైపులైన్ నెట్‌వర్క్ విస్తరించి ఉంది. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 2.656 కి.మీ, ఓఆర్‌ఆర్ పరిధిలో 4,378 కి.మీ మేర విస్తరించాలన్న ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇక మురుగు శుద్ధి.. వంద శాతం
ఇప్పటికే 37 ఎస్టీపీలు.. త్వరలో మరో 8 అందుబాటులోకి
అమృత్ 2.0 కింద కొత్తగా 39 నిర్మాణాలు..
కేంద్రం వద్ద మరో 62 ఎస్టీపీలకు ప్రతిపాదనలు
ముందస్తుగా పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే సీవరేజీపై ప్రణాళిక
నాగోల్ ఎస్టీపీ పని తీరుతో జలమండలికి ‘వరల్డ్ వాటర్’ అవార్డు
దక్షిణాసియాలోనే వంద శాతం మురుగును శుద్ధి చేసే తొలి నగరంగా రికార్డు సృష్టించేందుకు హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది. రాబోయే పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే మురుగును సైతం శుద్ధి చేసేందుకు ముందస్తు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి అడుగులు వేస్తోంది. సరికొత్త సాంకేతికతో మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణ పనులు పూర్తి చేస్తోంది. తాజాగా అమృత్ 2.0 పథకం కింద మరో 39 ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధమైంది.
– సాక్షి, సిటీబ్యూరో
ముందస్తు ప్రణాళికతో..
నగరం శరవేగంగా విస్తరిస్తోంది. రాబోయే పదేళ్లలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని అంచనా వేసి.. శుద్ధి ప్రక్రియ కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించాం. మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేసే విధంగా ఎస్టీపీల నిర్మాణ పనులు పూర్తి చేశాం. భవిష్యత్తు అవసరాల కోసం అమృత్ ఎస్టీపీలు నిర్మిస్తున్నాం. మూసీలో కలిసే మురుగు నీటిని సైతం శుద్ధి కోసం ఎస్టీపీలను ప్రతిపాదించాం.
– అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ
అత్యాధునిక సాంకేతికతతో..
సరికొత్త సాంకేతిక ‘సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్‌బీఆర్) టెక్నాలజీతో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. తక్కువ విస్తరణ, తక్కువ విద్యుత్‌తో ఎక్కువ మురుగు నీటిని ఇవి శుద్ధి చేస్తాయి. నిర్మాణ వ్యయం తక్కువే. మ్యాన్‌పవర్ లేకుండా పూర్తిగా ఆటోమెటిక్‌గా మురుగు నీటి శుద్ధి ప్రక్రియ కొనసాగుతోంది.
– సుదర్శన్, జలమండలి డైరెక్టర్