
గ్రేటర్‌లో శాంతిభద్రతల్ని మంటగలుపుతున్నారు..
కాంగ్రెస్ హయాంలో అన్నీ అరాచకాలే
గౌతంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కనుమరుగవుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అల్వాల్‌లో ఇటీవల ఆషాడమాసం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గొడవల కారణంగా గాయపడిన గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త మేకల రాముయాదవ్ తదితర బీఆర్‌ఎస్ నేతలను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ చెలరేగిపోతారని, శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని రకరకాలుగా మాట్లాడరని, కానీ బీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ అభివృద్ధిని, శాంతి భద్రతల పరిరక్షణను గుర్తించిన ప్రజలు 2018, 2023 శాసన సభ ఎన్నికలలో హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తిరుగులేని విజయాన్ని అందించారన్నారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీలో 99 కార్పొరేటర్ సీట్లు గెలిచి రికార్డు సృష్టించామన్నారు. హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదనే కోపంతో ఇక్కడి ప్రజలమీద పగబట్టి శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నారని కాంగ్రెస్ పాలకులపై మండిపడ్డారు.
పోలీసులు ఏం చేస్తున్నారు?
హైదరాబాద్‌లో నగరంలో పిచ్చి కుక్కలు బాగా పెరిగిపోయాయని, అలాగే మల్కాజిగిరిలో కూడా పిచ్చి కుక్కలు బాగా పెరిగిపోయాయన్నారు. మల్కాజిగిరి చౌరస్తాలో గంటసేపు ట్రాఫిక్‌జాం చేస్తూ..‘నేను ఇక్కడికి వచ్చిన..నువ్వు రా’ అని, బస్తీమే సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయాలు చేస్తుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. మా ఎమ్మెల్యేలను, నాయకులను అరెస్టు చేసుడు కాదు..ఇలాంటి గూండాగాళ్లను నియంత్రించాలన్నారు. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడకనే రౌడీలతో దాడులు చేయిస్తోందని విమర్శించారు.
అధికారం శాశ్వతం కాదు..
‘ఎప్పడూ..ఎవ్వరికీ రాజకీయ అధికారం శాశ్వతం కాదు. మళ్లీ మా టైం వస్తది. ఈ రోజు కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులను మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం’ అని కేటీఆర్ హెచ్చరించారు. పోలీసులు కాంగ్రెస్‌కు తొత్తులుగా పనిచేస్తూ ఇటీవల గాయపడిన మేకల రాము యాదవ్‌పై ఏడు కేసులు, జగదీష్ గౌడ్, చిన్నాయాదవ్, కార్పొరేటర్ సబిత కిషోర్‌లపై కేసులు నమోదు చేశారని, దాడికి పాల్పడ్డ వారిపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు. మల్కాజిగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే గతంలో డైరెక్టుగా సిద్దిపేటకు వెళ్లి మా మాజీ మంత్రి హరీష్‌రావు కార్యాలయంపై దాడి చేసి..అక్కడున్న బోర్డులను ధ్వంసం చేసి హరీష్‌రావును పెట్రోపోసి తగలపెడతానని బహిరంగంగా మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికిపందలు ఈ రాష్ట్ర పోలీసులు అని దుయ్యబట్టారు. విధ్వంసకర రాజకీయాల కారణంగా ఇటీవల పక్కరాష్ట్రంలో ఓ ఐపీఎస్ అధికారి రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మల్కాజిగిరిలో మా పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులపై దాడి జరిగితే రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్‌లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వస్తామని, అప్పుడు పూర్తి బాధ్యత డీజీపీ, రాష్ట్ర హోం మంత్రి, పోలీసులదే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ అత్మాభిమానాన్ని చంపుకొని పనిచేస్తోంది..
హైదరాబాద్‌లో ఒక్క సీటు రాలేదని కక్షగట్టి గూండా రాజకీయాలు
కాంగ్రెస్ పాలనపైమాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు