
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం?
● ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం.. ప్రజలకు శాపం
● నాలా ప్రాంతాల్లోనూ అశ్రద్ధే.. ప్రాణాలు పోతున్నా అంతేనా
వర్షాలు కురుస్తున్నా తెరిచి ఉంచుతున్న మ్యాన్‌హోళ్ల మూతలు
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయా ప్రభుత్వ విభాగాలు చెబుతున్నా, ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గురువారం ఐదేళ్ల బాలిక మ్యాన్‌హోల్ గుంతలో పడటమే ఇందుకు నిదర్శనం. సకాలంలో స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రతియేటా వర్షాకాలానికి ముందే వానలతో ప్రమాదాలు సంభవించకుండా నాలా ప్రాంతాల్లో భద్రత చర్యలు పరిశీలించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కప్పులు వేయడం, మెష్‌లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆపనులు సవ్యంగా జరగడం లేదు. దాంతో పిల్లలు, పాదచారులు, కార్మికులు నాలాల్లో పడి మరణిస్తున్నారు.
భద్రత కరువు
తగిన రక్షణ ఏర్పాట్లు, భద్రత చర్యలు లేకపోవడంతోనే ఏడాది క్రితం కవాడిగూడ నాలాలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అంతకుముందు సంవత్సరాల్లో ఓల్డ్‌బోయిన్‌పల్లిలో ఆనంద్‌సాయి, నేరేడ్‌మెట్‌లో సుమేధ, యాకుత్‌పురాలో జకీర్ అబ్బాస్ తదితర బాలలు నాలాల్లో పడి ప్రాణాలు కోల్పోయారు.
హైడ్రా నిర్వాకం
గురువారం ఉదయం రెయిన్‌బజార్ డివిజన్ మౌలాకాచిల్లా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక స్కూల్‌కు వెళ్తూ మూత లేకుండా ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. బాలిక నానమ్మ, స్థానికులు గుర్తించి వెంటనే.. పైకి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. జీహెచ్‌ఎంసీ నిర్వాకం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ మ్యాన్‌హోల్ పనులు తాము చేయడం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. హైడ్రా సిబ్బంది మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు బుధవారం మూత తెరిచారు. తిరిగి దాన్ని మూసివేయకుండా అలాగే వదిలేసి వెళ్లారు.
సమన్వయ లేమి..
వరుస వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మ్యాన్‌హోళ్లు, నాలాల్లో పూడికతీత తదితర పనుల్ని జీహెచ్‌ఎంసీ చేసేది. రోడ్లపై నిల్వ నీటిని తోడిపోసేది. చెరువుల పరిరక్షణ, విపత్తు నిర్వహణలో హైడ్రాకు మంచి పేరు రావడంతో వర్షాకాల సమస్యల పరిష్కార బాధ్యతల్ని కూడా జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించారు. దీంతో జీహెచ్‌ఎంసీ కేవలం రోడ్లపై గుంతల్ని మాత్రమే పూడస్తోంది. మిగతా పనులు చేయడం లేదు. నాలాలు, మ్యాన్‌హోల్స్, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైడ్రాకు సరైన అవగాహన లేదు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినప్పటికీ, విభాగాల మధ్య అధికారుల మధ్య అది సాధ్యమవుతున్నట్లు లేదు. హైడ్రా సిబ్బంది మిగతా విభాగాల కంటే తామే గొప్ప అనేవిధంగా పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.