పానీపూరీ తిని నెల రోజులు ఆస్ప‌త్రిపాలైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ | Software Engineer Hospitalised One Month After Eating Pani Puri | Sakshi
Sakshi News home page

పానీపూరీ తిని నెల రోజులు ఆస్ప‌త్రిపాలైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

Sep 13 2025 5:26 PM | Updated on Sep 13 2025 6:27 PM

Software Engineer Hospitalised One Month After Eating Pani Puri

ఉద్యోగానికి దూరం.. ఆపై చికిత్స‌ల ఖ‌ర్చు భారం

హైద‌రాబాద్: రోడ్డుప‌క్క‌న పానీపూరీ బండి క‌న‌ప‌డ‌గానే నోరు ఊరుతుంది. కానీ, అందులో వాడే నీళ్ల నాణ్య‌త గానీ, అమ్మే వ్య‌క్తి పాటించే ప‌రిశుభ్ర‌త గానీ ప‌ట్టించుకోకుండా తిన‌డానికి వెళ్తే ఒక్కోసారి పెనుముప్పు వాటిల్లుతుంది. న‌గ‌రానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విష‌యంలో ఇలాగే జ‌రిగింది. పానీపూరీ తిని, తీవ్ర‌మైన హెప‌టైటిస్ ఎ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డిన ఆ యువ‌కుడు నెల రోజుల పాటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందాల్సి వ‌చ్చింది. దాంతో అన్నాళ్లూ ఉద్యోగానికి దూరం కావ‌డ‌మే కాక‌, చికిత్స ఖ‌ర్చు భారం కూడా అత‌డి మీద ప‌డింది. న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు స‌కాలంలో చికిత్స చేసి అత‌డి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్. కలువల హర్ష తేజ తెలిపారు.  

“క‌ళ్లు, చ‌ర్మం ప‌సుపుప‌చ్చ‌గా అయిపోవ‌డం (కామెర్లు), క‌డుపులో ఏదో ఇబ్బంది, వికారం, వాంతులు, నీర‌సం, మూత్రం బాగా ముదురు రంగులో ఉండ‌డం లాంటి స‌మ‌స్య‌ల‌తో ఆ యువ‌కుడు ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. ఏం జ‌రిగింద‌ని లోతుగా ప్ర‌శ్నిస్తే, తాను రెండు వారాల క్రితం రోడ్డుప‌క్క‌న పానీపూరీ తిని, అక్క‌డ డ‌బ్బాలో మంచినీళ్లు తాగాన‌ని చెప్పాడు. ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయ‌డా హెప‌టైటిస్ ఎ తీవ్రంగా ఉంద‌ని, దాంతోపాటే కాలేయంలోని ఎంజైమ్‌లు పెరిగాయ‌ని, యాంటీ-హెచ్ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ అని తేలింది.

చాలామంది యువ‌త‌లో హెప‌టైటిట్ ఎ దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. కానీ, నిర్ల‌క్ష్యం చేస్తే అది చాలా ఇబ్బంది, స‌మ‌స్య‌లు తెస్తుంది. వీధుల్లో అప‌రిశుభ్రంగా ఉండే ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఎంత తీవ్ర‌మైన కాలేయ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయో ఈ కేసు వ‌ల్ల తెలుస్తుంది. ఆ యువ‌కుడికి ముందుగా హైడ్రేష‌న్ ఇచ్చి, కాలేయాన్ని కాపాడే మందులు, ఇత‌ర చికిత్స‌ల‌తో 2-3 వారాలు పూర్తిగా విశ్రాంతి ఇచ్చాం. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు చేశాం. కాలేయం క్ర‌మంగా మెరుగుప‌డింది. నాలుగు వారాల‌కు అత‌డు పూర్తిగా కోలుకున్నాడు. ఆహారం విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై కౌన్సెలింగ్ ఇచ్చి, భ‌విష్య‌త్తులో ర‌క్ష‌ణ కోసం హెప‌టైటిస్ ఎ టీకా తీసుకోవాల‌ని సూచించాం" అని తెలిపారు.

మ‌నం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే రోజువారీ ప‌నుల్లో జాగ్ర‌త్త‌లు పాటిస్తే మ‌న కాలేయం భ‌ద్రంగా ఉంటుంద‌ని, పాటించ‌క‌పోతే ముప్పులో ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. త‌గిన అవ‌గాహ‌న‌, నిరోధ‌క టీకాలు అందించ‌డం ద్వారా ఇలాంటి నిరోధించ‌గ‌ల వ్యాధుల నుంచి స‌మాజాన్ని ర‌క్షించ‌వ‌చ్చు.

-డాక్ట‌ర్. కలువల హర్ష తేజ, గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్ట్

 

 

 

 




 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement