
రూ.1000 కోట్ల మోసం..
ఇద్దరు నిందితుల అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: వ్యవస్థీకృత ఆర్థిక నేరాల నెట్‌వర్క్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్రేక్ చేశారు. కృత్రిమ మేధ ఆధారిత పెట్టుబడుల పేరిట సుమారు రూ.1,000 కోట్లు మోసం చేసిన ఇద్దరు ఘరానా కేటుగాళ్లను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన గడ్డం వేణుగోపాల్, కర్ణాకటకు చెందిన శ్రేయాస్ పాల్ ఇరువురు కలిసి సైబరాబాద్ కేంద్రంగా నకిలీ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఐఐటీ క్యాపిటల్ టెక్నాలజీస్, ఏవీ సొల్యూషన్స్, శ్రీనివాస్ అనలిటిక్స్, ట్రేడ్ బుల్స్ టెక్నాలజీస్ వంటి రకరకాల పేర్లతో ఆన్‌లైన్‌లో నకిలీ కంపెనీలను నిర్వహిస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నకిలీ సెబీ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ రిజిస్ట్రేషన్లను సైతం సృష్టించారు. మధ్యతరగతి ఇన్వెస్టర్లను, ఐటీ నిపుణులు, రిటైర్డు ఉద్యోగులను నమ్మించేందుకు ప్రీమియం ఆఫీసులు, హోటళ్లలో సెమినార్లలో నిర్వహించేవారు. పెట్టుబడులపై ఏటా 84 శాతం రాబడిని అందిస్తామని మాయమాటలు చెప్పారు. స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్, కల్పిత ట్రేడింగ్ డాష్‌బోర్డ్‌ల ముసుగులో 2022 నుంచి 2025 మధ్య కాలంలో సుమారు 3 వేలకు పైగా బాధితుల నుంచి రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులను వసూలు చేశారు. ఇన్వెస్టర్ల నుంచి వసూళ్లు చేసిన సొమ్మును 21 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు మళ్లించారు. ఆయా సొమ్ముతో ప్రాపర్టీలు, లగ్జరీ వాహనాలు, బంగారం కొనుగోలు చేశారు. ఈమేరకు పలువురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులు గడ్డం వేణుగోపాల్, శ్రేయాస్ పాల్‌లను అరెస్టు చేశారు. 20 మందికి పైగా ఏజెంట్లు, కన్సల్టెంట్లు, టెక్నికల్ డెవలపర్లు, వెబ్‌సైట్ నిర్వాహకులు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.