
మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారి..
తప్పిన ప్రాణాపాయం
యాకుత్‌పురా: పాఠశాలకు వెళ్తున్న ఓ చిన్నారి ప్రమాదశాత్తు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడి స్వల్ప గాయాల పాలైన ఘటన గురువారం యాకుత్‌పురాలో జరిగింది. యాకుత్‌పురా గంగానగర్ నాలా మౌలా కా చీల్లా ప్రాంతానికి చెందిన సల్మాన్ కుతూరు జైనాబ్ ఫాతిమా (5) స్థానిక పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. గురువారం ఉదయం నానమ్మతో కలిసి పాఠశాలకు బయలుదేరింది. రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ పైకప్పు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. దీంతో ఆమె నానమ్మ, స్థానికులు వెంటనే చిన్నారి ఫాతిమాను పైకి లాగి కాపాడారు. స్వల్ప గాయాల పాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జలమండలి, హైడ్రా విభాగాల అధికారులు సిబ్బందితో మౌలాకా చీల్లా ప్రాంతాంలో డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల పూడికతీత పనులు చేపట్టి పైకప్పు వేయకుండా వదిలేసిన వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పత్తర్‌గట్టీ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ డిమాండ్ చేశారు.
మ్యాన్‌హోల్‌లో పడిపోతున్న చిన్నారి ఫాతిమా