
వీధిలో చెత్త వేశారో.. మీ ఇంటికి పోలీసులొస్తారు
● 2024 అక్టోబర్ 11: మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ ప్రార్థన స్థలం ఎదురుగా రోడ్డుపై ఓ ప్రాణి మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు దర్యాప్తు చేపట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న చెత్తకుప్ప నుంచి ఓ వీఽధికుక్క మాంసం తీసుకువెళ్తుండగా... ఓ ముక్క ప్రార్థన స్థలం సమీపంలో పడిపోయిందని తేలింది.
● 2025 ఫిబ్రవరి 12: టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ దేవాలయంలోనూ మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయం కొద్దిసేపట్లోనే దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అవాంఛనీయ ఘటలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ మాంసం అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి చుట్టు పక్కల సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో చెత్త కుప్పలో పడేసిన వ్యర్థాల నుంచి ఓ పిల్లి తీసుకువచ్చి అక్కడ పడేసినట్లు వెలుగులోకి వచ్చింది.
సాక్షి, సిటీబ్యూరో
నగరంలో తరచూ చోటుచేసుకుంటున్న ఇలాంటి ఉదంతాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఎవరి ప్రమేయం, ఎలాంటి దురుద్దేశం, కుట్ర లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈ తరహా ఘటనలు శాంతిభద్రతల సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి.
గణేష్, దుర్గా నవరాత్రుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద ఇలా జరిగితే పరిస్థితులు చేతులు దాటిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, మాంసం ఆహార వ్యర్థాలు వేయడమే వీటికి మూలమనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టారు.
నిషేధం ఉన్నా పట్టించుకోని ప్రజలు...
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంపై ఏళ్లుగా నిషేధం ఉంది. ఇలా చేసిన వారికి జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణీత మొత్తం జరిమానా విధించే అవకాశమూ ఉంది. గతంలో బల్దియా అధికారులు ఇంటింటికీ చెత్త డబ్బాలు కూడా పంచి పెట్టారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే విధానమూ అమలులో ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక మంది బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేస్తున్నారు. గార్బేజ్‌ల వద్దే కాకుండా కాస్త ఖాళీ కనిపిస్తే చాలు అక్కడ డంప్ చేస్తున్నారు. ఇళ్ల నుంచి తీసుకువచ్చి పడేసే ఈ చెత్తలో ఆహార వ్యర్థాలు, మాంసం కూడా ఉంటున్నాయి. ఇలా బహిరంగ ప్రదేశాల్లో పారేసే చెత్తను క్లియర్ చేయడం, అలా వేయకుండా నియంత్రించడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అవసరమైన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు. ఫలితంగానే ఎన్ని స్వచ్ఛ అవార్డులు గెల్చుకున్న నగరమైనా ఇప్పటికీ ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తుంటాయి.
రంగంలోకి దిగిన పోలీసు విభాగం..
ఈ చెత్త వల్ల ఉత్పన్నం అవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం నియంత్రించాలని నిర్ణయించింది. దీనికోసం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను వినియోగించుకుంటోంది. ప్రతి ప్రాంతంలోనూ కాకపోయినా.. కొన్ని సున్నిత, కీలక ప్రాంతాలపై దృష్టి పెడుతోంది. ప్రధానంగా రెండు వర్గా లు, ప్రార్థన స్థలాలు ఉన్న చోట్ల ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా చెత్త వేస్తున్న వారిని స్థానిక పోలీసులు గుర్తించనున్నారు. ఆపై వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి సిఫార్సు చేయడమో, సిటీ పోలీసు చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవమో చేయనున్నారు. ప్రధానంగా వెస్ట్, సౌత్, సౌత్ వెస్ట్ జోన్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ చర్య ల వల్ల అవాంఛిత ఘటనలు నిరోధించడంతో పా టు స్వచ్ఛ హైదరాబాద్‌ను సాధించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తీవ్ర ఇబ్బందులు తెస్తున్న ఆహార, మాంస వ్యర్థాలు
కొన్నిసార్లు శాంతిభద్రతల సమస్యల వరకు..
నిఘా వేసి ఉంచాలని నగర పోలీసుల నిర్ణయం
సీసీ కెమెరాలను సైతం వినియోగిస్తున్న కాప్స్