
జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిందే
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించాలి
కలెక్టర్ల కార్యాచరణపై సీఎస్ రోజూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి
వర్షాకాలం సమస్యల పరిష్కారానికి రూ.కోటి చొప్పున కలెక్టర్ల ఖాతాలకు.. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
కావాల్సినంత యూరియా ఉంది.. రైతులు ఆందోళన చెందొద్దు
25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామన్న సీఎం
వర్షాలు, పంటల సాగు, వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు జరపాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని చెప్పారు. తద్వారా మిగతా అధికారులు కూడా అప్రమత్తమవుతారని సూచించారు. కలెక్టర్లతో పాటు ఇతర ఐఏఎస్‌లు, అదనపు కలెక్టర్లు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిరోజూ ప్రభుత్వానికి నివేదిక అందించాలని చెప్పారు. సీఎంఓలోని ఒక్కో అధికారికి రెండేసి ఉమ్మడి జిల్లాల బాధ్యతలు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా కలెక్టర్ల ఖాతాలో కోటి రూపాయలు చొప్పున అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్‌వ్యాధులపై అప్రమత్తత, రేషన్‌కార్డుల పంపిణీలో పురోగతి తదితర అంశాలపై సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
అజాగ్రత్తగా ఉంటే ఉపేక్షించేది లేదు..
‘వర్షాల నేపథ్యంలో జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ శాఖ అందించే వర్ష సూచనలపై కనీసం మూడు గంటల ముందే రైతులు, ప్రజలను అప్రమత్తం చేసే వీలుంది.
ఈ విషయంలో కలెక్టర్లు బాధ్యత వహించాలి. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగు పాటు మరణాలను నమోదు చేస్తే భవిష్యత్తులో వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించే వీలుంటుంది. వర్షాల సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విభాగాలు మరింత సమర్థంగా పని చేయాలి. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా జీహెచ్‌ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్ విభాగాలు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా అధ్వర్యంలోని 150 టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగాలి. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు..’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
అంటు వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
‘వర్షాకాలంలో డెంగీతో పాటు సీజనల్ జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి.
యూరియా పక్కదారి పడుతోంది..
కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైంది. త్వరలోనే నాగార్జునసాగర్ నీటిని కూడా విడుదల చేస్తాం. గోదావరి పరిధిలో వర్షాలు తక్కువగా ఉన్నందున కొంత ఆలస్యమవుతుంది. సబ్సిడీతో కూడిన యూరియా పూర్తిగా రైతులకు మాత్రమే చెందాలి. కానీ 20 నుంచి 25 శాతం యూరియా పక్కదారి పడుతున్నట్లు తెలిసింది.
యూరియాను డీజిల్‌లో పొగను తగ్గించడానికి వాడుతున్నట్లు తెలిసింది. ఇతర వ్యాపార అవసరాలకు కూడా యూరియాను మళ్లిస్తున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి హెచ్చరించారు. దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఈ సీజన్‌లో ఆగస్టు వరకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా నిల్వ వివరాలను డీలర్లు, షాపుల వద్ద బోర్డుపై ప్రదర్శించాలి.

అధికారులు బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలి. నిల్వల వివరాలు ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అన్నిచోట్ల డీలర్ల వద్ద, షాపుల వద్ద ఇద్దరు అధికారులు, ఇద్దరు పోలీసులను అందుబాటులో ఉంచాలి. ఎరువులకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలి..’ అని సీఎం ఆదేశించారు.
కార్డుల పంపిణీలో మంత్రులు, కలెక్టర్లు పాల్గొనాలి
‘కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో దాదాపు 7 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో దాదాపు 31 లక్షల కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం రాష్ట్రంలో 96.95 లక్షల కార్డులతో 3.10 కోట్ల మంది సన్న బియ్యం తీసుకుంటున్నారు.
పేదలకు సన్న బియ్యం అందించే ఈ రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించాలి. ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి.
డిజిటల్ కార్డులు రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రింటెండ్ కార్డుల ద్వారా ప్రతి మండలంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కూడా పాల్గొనాలి. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకచోట జిల్లా ఇన్‌చార్జి మంత్రి పాల్గొనాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, సీఎస్ కె.రామకృష్ణారావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కొత్తగూడెం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.