
మరోసారి మహా రియల్!
సాక్షి సిటీబ్యూరో: కొత్త లేఅవుట్‌ల అభివృద్ధికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సొంత స్థలాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతుల నుంచి కూడా భూములను సేకరించి భారీ లే అవుట్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొనడంతో కొత్త లే అవుట్‌ల ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేశారు. ప్రస్తుతం కొంతవరకు సానుకూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అధికారులు కొత్త లేఅవుట్‌ల అభివృద్ఙిపై దృష్టి సారించారు. వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూముల సేకరణ వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా భూములను హెచ్‌ఎండీఏకు అప్పగించేందుకు ముందుకు రావడంతో లే అవుట్‌ల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. గతంలో కోకాపేట్, బుద్వేల్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో అనూహ్యమైన స్పందన రావడంతో.. మరోసారి అదే స్థాయిలో స్పందన లభించకపోయినప్పటికీ హెచ్‌ఎండీఏ స్వయంగా వెంచర్లను అభివృద్ధి చేసి విక్రయిస్తే రియల్ రంగంలో కొంత మార్పు రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
సుమారు 500 ఎకరాల్లో..
నగర శివార్లలోని కుర్మల్‌గూడ, ప్రతాపసింగారం, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్‌నర్వ, కొర్రెముల, నాదర్‌గుల్ తదితర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించారు. ఇప్పటికే ఇన్ముల్‌నర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాల భూములలో రోడ్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టారు. మిగతా చోట్ల కుర్మల్‌గూడలో 92 ఎకరాలు, బోగారంలో 125, ప్రతాపసింగారంలో సుమారు 151, దండుమల్కాపురంలో మరో 355 ఎకరాల చొప్పున భూమి ఉన్నట్లు గుర్తింంచారు. తిమ్మాపూర్‌లో 156 ఎకరాలు, కుత్బుల్లాపూర్‌లో 130, కొర్రెములలో 138 ఎకరాలు చొప్పున సేకరించనున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూములు అందుబాటులో ఉన్నట్లు అంచనా. రైతుల నుంచి భూముల సేకరణ వివిధ దశల్లో ఉంది. మొదట కనీసం 500 ఎకరాల్లో లే అవుట్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. గతంలో హెచ్‌ఎండీఏ వెంచర్‌లలో ప్లాట్‌లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడంతోనే రైతులు తమ భూములను హెచ్‌ఎండీఏకు అప్పగించేందుకు ఆసక్తితో ఉన్నట్లు అధికారులు చెప్పారు. కొనుగోలుదారులు సైతం హెచ్‌ఎండీఏపై నమ్మకంతో ముందుకు వస్తున్నారు.
ప్రతాపసింగారంలో పనులు..
సుమారు 150 మంది రైతుల నుంచి ప్రతాపసింగారంలో ఇప్పటికే 133 ఎకరాల భూమి సేకరించారు. మరిన్ని భూముల సేకరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నవాటితో పాటు కొత్తగా సేకరించనున్న వాటితో కలిపి సుమారు రూ.120 కోట్లతో భారీ వెంచర్‌ను అభివృద్ధి చేయనున్నారు. రైతులకు ఎకరాకు 1,741 చదరపు గజాల చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లను అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభించనుంది. మూడేళ్ల క్రితమే ఈ వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణం, మార్కింగ్ పనులు కొనసాగుతున్నాయి. నగరానికి తూర్పు వైపున, ఔటర్‌రింగ్‌రోడ్డుకు చేరువలో ఉండడంతో ప్రతాపసింగారం లే అవుట్‌కు అనూహ్యమైన స్పందన లభించవచ్చని అంచనా వేస్తున్నారు.
నయా వెంచర్ల ఏర్పాటులో హెచ్‌ఎండీఏ
ఔటర్ సమీప గ్రామాల్లో లే అవుట్లకు సన్నాహాలు
కుత్బుల్లాపూర్, కొర్రెముల, కుర్మల్‌గూడ, ప్రతాపసింగారంలలో..