
సీఎం రేవంత్‌రెడ్డి కోసం వేచిచూస్తున్న కేటీఆర్. చిత్రంలో ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కవిత, సబిత, గంగుల, దాసోజు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడు
కాంగ్రెస్ అగ్రనేతలకు, బీజేపీ పెద్దలకు మూటలు మోస్తున్నాడని ఆరోపణ
ఆయనకు రచ్చ తప్ప చర్చ చేతకాదని తేలిపోయిందని ఎద్దేవా
ప్రెస్‌క్లబ్‌లో సీఎంకు ప్రత్యేక కుర్చీ వేసి వేచిచూసిన బీఆర్‌ఎస్ నేత
సాక్షి, హైదరాబాద్: ‘ఆనాటి రోజులు తెస్తామంటూ ఎన్నికల్లో పాటలు రాయించుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పాత దుర్దినాలను తీసుకొచ్చింది. ఇందిరమ్మ రాజ్యం పేరిట అక్రమ కేసులు, అణచివేతలు, నిర్బంధాలకు పాల్పడుతోంది. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ రోజులను తలపించేలా పాలన సాగుతోంది. అరుపులు, గావు కేకలు, బూతులు మాట్లాడటం మినహా రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదు. రాష్ట్ర రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని సీఎం విసిరిన సవాలును స్వీకరించి వచ్చాను. నదుల బేసిన్‌లతో సహా ఏ అంశంపైనా రేవంత్‌కు బేసిక్ నాలెడ్జ్ లేదని తెలిసినా ఆయన ముచ్చట పడుతున్నాడని సవాలును స్వీకరించా.
ప్రజల సమక్షంలో, మీడియా సాక్షిగా చర్చ కోసం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తే సీఎం ఢిల్లీకి పారిపోయాడు. సీఎంకు వీలుకాని పక్షంలో డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి లేదా ఇతర మంత్రులను ఎవరినైనా చర్చకు పంపుతారని భావించా. కానీ రేవంత్‌కు రచ్చ చేయడం మినహా చర్చ చేయడం రాదని నేటితో తేలిపోయింది..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ ఈ నెల 4న ఎల్‌బీ స్టేడియం వేదికగా చేసిన సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన కేటీఆర్.. మంగళవారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. సీఎం కోసం ప్రత్యేక కుర్చీ వేసి పార్టీ నేతలతో కలిసి అరగంట వేచి చూశారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
అందరూ ‘పే సీఎం’అంటున్నారు..
‘రాష్ట్రంలో 18 నెలలుగా అరాచక పాలన సాగుతోంది. రేవంత్‌రెడ్డి రాష్ట్ర రైతులను మోసం చేస్తూ తన గురువు చంద్రబాబునాయుడు కోసం కృష్ణా, గోదావరి జలాలను వదులుతూ బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపుతున్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకుని చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడు. నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి తరలిస్తున్నాడు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోస్తూ పదవిని కాపాడుకుంటున్నాడు. పేమెంట్ కోటాలో పీసీసీ, సీఎం పదవి తెచ్చుకున్న రేవంత్‌ను అందరూ ‘‘పే సీఎం’’అంటున్నారు.
మరో చాన్స్ ఇస్తున్నాం.. తేదీ చెప్పండి
రుణమాఫీ, రైతు భరోసా అందని రైతులు, మిల్లర్లకు ధాన్యం అమ్ముకుని నష్టపోయిన రైతుల జాబితాను తీసుకుని నేను బహిరంగ చర్చ కోసం వస్తే.. తొడగొట్టి సవాలు విసిరిన సీఎం ఎప్పటిలాగానే పారిపోయాడు. ముఖ్యమంత్రికి ఒకవేళ తీరిక లేదనుకుంటే మరో అవకాశం ఇస్తున్నాం. తేదీ, సమయం, వేదిక మీరే చెప్పండి. జూబ్లీహిల్స్‌లోని మీ ప్యాలెస్‌కు అయినా వస్తాం. ఏ అంశం మీద చర్చ పెట్టినా వచ్చేందుకు సిద్ధం మైక్ కట్ చేయకుండా అవకాశం ఇస్తే అసెంబ్లీలో చర్చకు కూడా వస్తాం. ఒకవేళ సీఎం చర్చకు రాకపోతే ముక్కు నేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్‌తో..
కేటీఆర్ ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ వాహన కాన్వాయ్‌తో ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్.. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతలకు సంతాపం ప్రకటించారు. అనంతరం సీఎం కోసం వేచి చూశారు. ‘కేటీఆర్ ఇక్కడ.. రేవంత్ ఎక్కడ?’అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కాగా పోలీసులు మంగళవారం ఉదయం నుంచే తెలంగాణ భవన్, ప్రెస్‌క్లబ్ వద్ద పెద్ద సంఖ్యలో మోహరించారు.