
హైదరాబాద్: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక సాన్వీ లేక్ అపార్ట్‌మెంట్‌లో 1311 ప్లాట్‌లో రాకేష్ అగర్వాల్, రేణు (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ సనత్‌నగర్ లో స్టీల్ షాప్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో పని చేసేందుకు పది రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని వంట మనిషిని నియమించుకున్నారు. బుధవారం భర్త, కుమారుడు షాప్‌కు వెళ్లగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్ సహాయంలో తలుపులు తెరిచి చూడగా రేణు రక్తం మడుగులో పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి..
రేణు కాళ్లు, చేతులు కట్టేసి కుక్కర్‌తో తలపై మోది గొంతు కోసి హత్య చేశారు. రక్తం అంటుకున్న దుస్తులను అక్కడే విడిచి బాత్రూంలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని బ్యాగ్‌తో సహా యజమాని స్కూటీపై పరారైనట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 5 టీమ్‌లతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.