
మరణాలు తగ్గించేందుకు కాలపరిమితితో పనిచేయాలి
ప్రతి నెలా ఒకసారి జిల్లా రోడ్డు భద్రతా కమిటీ భేటీలు నిర్వహించాలి
రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే
సాక్షి,హైదరాబాద్: సరైన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించ వచ్చని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అన్నారు. ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు నిర్ణీత కాలవ్యవధి (టైమ్ బౌండ్) పెట్టుకొని సంబంధిత శాఖలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విధంగా చేస్తే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ‘రోల్ మోడల్’గా నిలిచే అవకాశం ఉందన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం, సమాజం ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు.
బుధవారం తెలంగాణలో రోడ్డు భద్రతపై ఉన్నతాధికారులతో మనోహర్ సప్రే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రోజుకు 500 మంది, గంటకు 25 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతినెలా కనీసం ఒకసారి క్రమం తప్పకుండా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలను నిర్వహించాలని సూచించారు.
ప్రమాదాలకు కారణమవుతున్న ‘బ్లాక్‌స్పాట్స్’ను సరిచేయాలని, రోడ్లపై గుంతలను వెంటనే పూడ్చాలని, చెల్లుబాటయ్యే డ్రైవింగ్, వాహన బీమా ఉండేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, వాహన యజమానులకు డ్రైవింగ్, వాహన బీమా గడువుతీరిపోవడానికి సంబంధించిన అలర్ట్‌లు పంపించాలని సప్రే తెలిపారు.
రోడ్డు భద్రతకు టెక్నాలజీ వినియోగం
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ కమిటీ, చట్టాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాల సమీక్షతో పాటు ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి అంశాల్లో మార్గనిర్దేశం చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలో చేపట్టిన చర్యలను సీఎస్ రామకృష్ణారావు, హోం సెక్రటరీ రవిగుప్తా వివరించారు. ట్రాఫిక్ నియంత్రణలో కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ వినియోగిస్తున్నట్లు డీజీపీ జితేంద్ర తెలిపారు. వాహనాల రిజి్రస్టేషన్లు, ప్రమాదాలు, మరణాలు, గాయాల వార్షిక గణాంకాలను ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ తెలియజేశారు.
పాఠశాలల్లో రోడ్డు భద్రతపై పాఠ్యాంశాలు ప్రవేశపెడుతున్నట్లు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై భద్రతా చర్యలు గురించి హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ప్రమాదకర ప్రాంతాలలో జాగ్రత్తలతో పాటు రోడ్లపై గుంతలు పూడ్చటం, లేన్‌మార్కింగ్, సిగ్నేజీల ఏర్పాటు వంటి ఇంజనీరింగ్ చర్యలను గురించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల పరంగా తెలంగాణ 8వ స్థానంలో, మరణాల పరంగా 10వ స్థానంలో ఉందని వివిధ శాఖల అధికారులు వెల్లడించారు.
హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం లేకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడకం, అతివేగం ప్రధాన కారణాలని తెలియజేశారు. దీంతో వీటిపై మరింత లోతైన అవగాహన కార్యక్రమాలు అవసరమని జస్టిస్ సప్రే సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, హెల్త్ కమిషనర్ డా.సంగీత తదితరులు పాల్గొన్నారు.