
రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధ్వాన పరిస్థితులు
విద్యార్థుల నుంచి రూ. కోట్లలో ఫీజులు గుంజుతున్నా కక్కుర్తి.. ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థులకు స్టైపెండ్ ఎగ్గొడుతున్న వైనం
ఆరోగ్య విశ్వవిద్యాలయ ఆకస్మిక తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు
8 కళాశాలల్లో నిబంధనల ఉల్లంఘన.. వాటిలో నాలుగింటిలో మరీ అధ్వానం
చల్మెడ, ఎంఎన్‌ఆర్, రాజరాజేశ్వర, మహేశ్వరి కాలేజీలకు షోకాజ్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలలు అడుగడుగునా జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది. ఆయా కళాశాలల్లో ప్రొఫెసర్లు, వాటికి అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో నర్సింగ్, ఇతర పారామెడికల్ సిబ్బంది ఎవరూ లేరనే విషయం వెల్లడైంది. దీంతో నిబంధనలు అతిక్రమించిన కాలేజీలకు వర్సిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
గతానికి భిన్నంగా తనిఖీలతో..
ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం వైద్య కళాశాలలను ఏటా రెన్యు వల్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ఎన్‌ఎంసీ అధికారులే తనిఖీ చేస్తే ప్రైవేటు వైద్య కళాశాలలను సంబంధిత ఆరోగ్య విశ్వవిద్యాలయం తనిఖీ చేసి నివేదికను ఎన్‌ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంటుంది. అయితే గతంలో ప్రైవేటు కళాశాలలకు ఫలానా తేదీన తనిఖీలకు వస్తున్నట్లు సమాచారం ఇవ్వడం వల్ల యాజమాన్యాలు అప్పటికప్పుడు రోగుల ను, వైద్యులను, సిబ్బందిని సమకూర్చుకొని ‘షో’చేసేవి. కానీ ఈసారి వీసీ నందకుమార్‌రెడ్డి నేతృత్వంలో ‘సీన్’మారింది.
తనిఖీలకు వెళ్లడానికి కేవలం అరగంట ముందే కళాశాలలకు వస్తున్నట్లు సంబంధిత యాజమాన్యాలకు సమాచారం ఇచ్చారు. స్వయంగా వీసీతోపాటు డీఎంఈ నరేంద్రకుమార్, వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్టులు బృందాలుగా ఏర్పాటై 8 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో తనిఖీలు చేయగా, ప్రైవేటు యాజమాన్యాల నిజస్వరూపం బహిర్గతమైంది. రెండు కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని చూసి వీసీ, డీఎంఈ విస్తుపోయారు.
ఖాళీ బెడ్లు... నిరుపయోగంగా యంత్రాలు
హైదరాబాద్ సమీపంలోని రాజరాజేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రిలో కార్పొ రేట్ హాస్పిటల్ తరహాలో పడకలు, అధునాతన పరికరాలను ఏర్పాటు చేసినా అందులో ఒక్క రోగి కూడా లేడు. ఆయా పరికరాలను నిర్వహించే సిబ్బంది సైతం కనిపించలేదు. వార్డుల్లో డాక్టర్లు, నర్సులు కూడా లేరు. కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాల ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
గత నెల 30న ఈ ఆసుపత్రిలో తనిఖీలు జరపగా పిల్లల విభాగం, సర్జికల్ వార్డు, మహిళా విభాగం, పురుషుల వార్డుతోపాటు తని ఖీలు నిర్వహించిన కె,ఎల్,ఎం. వార్డులన్నీ ఖాళీగానే ఉన్నాయి. సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల, మహేశ్వరి వైద్య కళా శాలల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.పారిశుద్ధ్య సిబ్బంది కూడా లేకపోవడంతో అత్యంత అధ్వానంగా ఆస్పత్రులు ఉన్నట్లు తనిఖీ చేసిన అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. తనిఖీలు జరిపిన మరో నాలుగు కళాశాలల్లో వీటికన్నా కొంత మెరుగైన పరిస్థితి ఉన్నట్లు ఆరోగ్య విశ్వవిద్యాలయం భావించింది.
నాలుగున్నరేళ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు
నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు దాదాపు అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఐదేళ్ల కోర్సు ఫీజు వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. అంటే ఈ లెక్కన ఒక్కో కళాశాల సీట్లను బట్టి ఏడాదికి రూ. 6 కోట్ల నుంచి రూ. 12 కోట్లు అదనంగా వసూలు చేస్తోంది. దీనికితోడు ఇంటర్న్íÙప్ చేసే విద్యార్థికి కళాశాల యాజమాన్యం నెలకు రూ. 25 వేల వరకు స్టైపెండ్ చెల్లించాల్సి ఉండగా తనిఖీలు జరిగిన కాలేజీల్లో ఏ కాలేజీ కూడా దాన్ని చెల్లించట్లేదు. స్టైపెండ్ అడిగిన పాపానికి ఇటీవల చల్మెడ మెడికల్ కళాశాల 60 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది.
ఇక తరచూ తనిఖీలు
ఈసారి ప్రైవేటు వైద్య కళాశాలల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికి 8 కళాశాలల్లో తనిఖీలు జరిపాం. నిబంధనలను పూర్తిగా కాలరాస్తున్న చల్మెడ, ఎంఎన్‌ఆర్, రాజరాజేశ్వర, మహేశ్వరి కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. 48 గంటల్లోగా వివరణ కోరాం. తని ఖీలు ఏడాదికోసారి కాకుండా తరచూ నిర్వహించాలని నిర్ణయించాం. నిబంధనలు పాటించని కళాశాలలపై పూర్తిస్థాయి నివేదికను ఎన్‌ఎంసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పరిస్థితి మారకపోతే వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. – కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ నందకుమార్‌రెడ్డి