నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్‌

May 16 2025 6:17 AM | Updated on May 16 2025 6:17 AM

నకిలీ

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్‌

నాంపల్లి: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసిన దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారి నుంచి 15 నకిలీ సర్టిఫికెట్లు, మూడు మొబైల్‌ ఫోన్లు, రూ. 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన షాబాజ్‌ ఖాన్‌, ముర్తుజా నగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఇస్మాయిల్‌, శాలివాహన నగర్‌కు చెందిన కడారి రమేష్‌ నకిలీ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పసికందును చిదిమేశాడు

గోల్కొండ: కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట కాలయముడయ్యాడు. 11 రోజుల పసికందును తన మరో నాలుగేళ్ల కుమార్తె ఎదుటే దారుణంగా గొంతు కోసి హత్య చేసిన సంఘటన గురువారం గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ బి.సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన జగత్‌ నగరానికి వలస వచ్చి అపార్ట్‌మెంట్‌ల వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం అతడి మొదటి భార్య చనిపోవడంతో తమ దేశానికే చెందిన గౌరీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. షేక్‌పేట్‌ గుల్షన్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న జగత్‌ కుటుంబంతో కలిసి అక్కడే వాచ్‌మెన్‌ రూంలో నివాసం ఉంటున్నాడు. వారికి ఓ కుమార్తె (4) ఉంది. 11 రోజుల క్రితం అతడి భార్య గౌరీ మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మద్యానికి బానిసైన జగత్‌ తరచూ తాగివచ్చి రాత్రి వేళల్లో భార్యతో గొడవపడేవాడు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి గదిలోనుంచి పసికందును తీసుకుని అపార్ట్‌మెంట్‌ గేటు బయటికి తెచ్చాడు. దీనిని గుర్తించిన అతడి పెద్ద కూతురు (4) తండ్రి వెంటే వచ్చింది. అనంతరం జగత్‌ పసికందును గేటు పక్కన రోడ్డుపై పడుకోబెట్టి గొంతు కోశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని టవల్‌లో చుట్టుకుని ఏమీ జరగనట్లు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే భార్య నిద్రలో ఉండడంతో పసికందు మృతదేహాన్ని గదిలోని మూలన దాచాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన అతడి భార్య గౌరి చిన్నారి కనిపించకపోవడంతో అపార్ట్‌మెంట్‌వాసులకు చెప్పింది. దీంతో వారు సీసీ కెమెరాలు పరిశీలించగా జగత్‌ చిన్నారిని హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోల్కొండ పోలీసులు నిందితుడు జగత్‌ కోసం గాలింపు చేపట్టారు. అతను మెహిదీపట్నంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని సెవన్‌ టూమ్స్‌– టోలిచౌకీ రోడ్డులోని డస్ట్‌ బిన్‌లో పడేసినట్లు చెప్పాడు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. టోలిచౌకీ ఏసీపీ సయ్యద్‌ ఫయాజ్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ సైదులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

11 రోజుల కుమార్తెను గొంతు కోసి చంపిన తండ్రి

మరో కుమార్తె ఎదుటే ఘాతుకం

పోలీసుల అదుపులో నిందితుడు

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్‌ 
1
1/1

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement