
సాయం చేసేందుకు వెళ్లి..
రాజేంద్రనగర్: తోటి మనిషికి సాయం చేసేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ కారు ఢీకొని మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట రుద్రారం ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ (25) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత 15 నెలలుగా మాదాపూర్‌లోని లాంగ్ డ్రైవ్ కార్స్‌లో పని చేస్తున్న అతను అక్కడే ఉంటున్నాడు. బుధవారం రాత్రి కారులో శంషాబాద్ వెళ్లిన అతను ఓఆర్‌ఆర్ మీదుగా గచ్చిబౌలికి తిరిగి వెళుతున్నాడు. హిమాయత్‌సాగర్ వద్దకు రాగానే అప్పా నుంచి శంషాబాద్ వైపు వెళుతున్న ఓ ఇన్నోవా కారు టైర్ పేలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి ఆగిపోయింది. దీంతో సదరు కారు డ్రైవర్ ఆజం టైర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో వెనకే వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు డ్రైవర్ పవన్ దీనిని గమనించి తన వాహనాన్ని పక్కకు ఆపి అతడికి సహాయం చేస్తున్నాడు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న మనోజ్ కుమార్ కూడా తన వాహనాన్ని పక్కన పార్కు చేసి రోడ్డు దాటి ఇన్నోవా కారు వద్దకు వచ్చాడు. జాకీ తీసుకుని టైర్ మార్చేందుకు ప్రయత్నిస్తుండగా వెనుకాల నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఇన్నోవాతో పాటు మనోజ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ పవన్‌తో పాటు ఇన్నోవా యజమాని ఆజంలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, ఓఆర్‌ఆర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. పంచనామా నిర్వహించి మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయపడిన ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మనోజ్ కుమార్ తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
● యువకుడి దుర్మరణం
● కారు టైరు మారుస్తుండగా ఢీకొన్న మరో కారు
● మరో ఇద్దరికి గాయాలు ● ఓఆర్‌ఆర్‌పై ఘటన

సాయం చేసేందుకు వెళ్లి..