
గురుకుల విద్యాసంస్థల్లో రాలుతున్న పసి మొగ్గలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గురుకుల విద్యా సంస్థలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. గతేడాది ఏకంగా 48 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం నెలన్నర వ్యవధిలోనే దాదాపు 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు కేజీబీవీ విద్యార్థులుండగా..ఒక వారం వ్యవధిలోనే నలుగురు మరణించడం చర్చనీయాంశమవుతోంది.
ఒంటరితనం..ఒత్తిడి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీలతో పాటు విద్యాశాఖ పరిధిలోని జనరల్ గురుకుల సొసైటీ పరిధిలో 1,038 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇవిగాకుండా విద్యాశాఖ పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ 600 వరకు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులకు వసతితో కూడిన ఉచిత బోధన ఉంటుంది. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లల్ని వీటిల్లో చేరుస్తుంటారు.
అయితే..ఇంటిపై బెంగ, హాస్టళ్లలో ఒంటరితనం, చదువు నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనై కొందరు ప్రాణాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా..మరికొన్ని చోట్ల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది వేధింపులు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు విద్యార్థుల ఆత్మహత్యలు నివారించే దిశగా సరైన చర్యలు చేపట్టడం లేదని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ఘటనలకు సంబంధించి ప్రభుత్వం ఏకంగా 20 మంది ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడం గమనార్హం.
బలహీన మనస్తత్వం..కౌన్సెలింగ్ అంతంత మాత్రం!
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ.. ఎక్కువ మంది బలహీనమైన మనస్తత్వం (వీక్ మైండెడ్) కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి దూరంగా ఉంటున్నామనే ఆలోచనలు, ఇతర విద్యార్థులతో పోటీ పడి చదవగలమా అనే ఆత్మన్యూనత భావం... బోధన, అభ్యసన కార్యక్రమాల ఒత్తిడి వారిని ప్రతికూల ఆలోచనలకు ప్రేరేపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవసరమైన కౌన్సెలింగ్ సరిగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ.. బీసీ గురుకుల సొసైటీలో జిల్లా కేంద్రంగా వీక్ మైండెడ్ విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయి.
పాఠశాల, కళాశాలలో వీక్ మైండ్ ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ విద్యార్థులను జిల్లా కేంద్రానికి పంపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎస్సీ గురుకుల సొసైటీలో ‘ప్రాజెక్టు మిత్ర’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు మరింత ముమ్మరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.
వారంలోనే నలుగురు..!
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా, సుమారు వారం వ్యవధిలోనే నలుగురు మరణించారు.
» ఈ నెల 13వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలంలోని ఉలిగేపల్లి గ్రామానికి చెందిన కురువ క్రిష్టన్న, సవారమ్మ దంపతుల కుమారుడైన హరికృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
» 14న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల వసతి గృహంలో ఊరబాయి సంధ్య (11) అనే విద్యార్థిని హాస్టల్ భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
» ఈ నెల 15న సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూష మహాలక్ష్మి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
» ఈ నెల 19వ తేదీ ఉదయం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సంతోష్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు.
» జూన్ నెలాఖరులో రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
» ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
» ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన మూడు నెలల్లో ఆరుగురు ఆత్మహత్య చేసుకోగా వీరిలో ముగ్గురు గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూషా మహాలక్ష్మి ఈ నెల 15న తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. చదువుల్లో టాపర్. 9వ తరగతిలో తానే టాపర్. 10వ తరగతిలో కూడా టాపర్‌గా నిలుస్తానని మాకు చెప్పింది. ఆమె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి..’ అని తనూష తల్లిదండ్రులు వెంకన్న, వసుంధర డిమాండ్ చేశారు.
పరిస్థితిని చక్కదిద్దుతున్నాం..
విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. గురుకులాల వరకు పరిశీలిస్తే.. దీర్ఘకాల వేసవి సెలవుల తర్వాత తిరిగి రావడం.. రెండునెలల పాటు తమకు ఇష్టం వచ్చినట్లుగా కాలం గడిపి..ఒక్కసారిగా ఆ వాతావరణానికి దూరం కావడం విద్యార్థులకు కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దే విధంగా గురుకులాల్లో చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు, తోబుట్టువులతో మాట్లాడేందుకు వీలుగా ‘ఫోన్‌మిత్ర’ అందుబాటులోకి తెచ్చాం. అన్ని సొసైటీల్లో ఇలా ఫోన్‌లను ఏర్పాటు చేశాం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు విద్యార్థులను చైతన్యపరిచేలా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. –అలగు వర్షిణి, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి
టీచర్లు, సిబ్బందిని ఎడ్యుకేట్ చేయాలి...
గురుకుల విద్యా సంస్థల్లో చదివే పిల్లల వయసు 18 ఏళ్లలోపే ఉంటుంది. ఎదిగీ ఎదగని వయసు కాబట్టి పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని..వారితో సందర్భోచితంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, గురుకుల సిబ్బందిపై ఉంది. ముఖ్యంగా విద్యార్థుల్లో అభద్రతా భావాన్ని తొలగించి, మానసికంగా బలపరిచే బాధ్యత ఉపాధ్యాయులు, సిబ్బంది తీసుకోవాలి. పిల్లలు అన్యమనస్కంగా ఉంటున్నట్లు, చురుగ్గా లేనట్టు గమనిస్తే..వెంటనే సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆత్మహత్యలు నివారించవచ్చు. – విశేష్, సైకాలజిస్ట్