
‘ట్రాఫిక్ పే’లో వివక్ష!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ నిర్వహణ కోసం ఓ జంక్షన్‌లో హోంగార్డు, ఇన్‌స్పెక్టర్, ఏసీపీ, అదనపు డీసీపీ నిల్చున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఎవరి డ్యూటీలు వారు చేశారు. ఈ నలుగురిలో హోంగార్డు, ఇన్‌స్పెక్టర్‌పై వాయు కాలుష్య ప్రభావం ఉండగా... ఏసీపీ, అదనపు డీసీపీపై మాత్రం లేదన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందేంటని అనుకుంటున్నారా..? ఈ కారణంగానే ట్రాఫిక్ వింగ్‌లో పని చేసే వారికి చెల్లిస్తున్న 30 శాతం పొల్యూషన్ పే ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకే అమలు చేయడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి విధులు నిర్వర్తించాల్సిందేనని, తమకూ పొల్యూషన్ పే అమలు చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.
రాజధానిలోనే ఎక్కువ ప్రభావం...
రాజధానిలో కాలుష్య ప్రమాణాలు నానాటికీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇది వాహనాలు ప్రయాణించే రోడ్లు, సిగ్నల్స్ నేపథ్యంలో ఆగుతున్న జంక్షన్ల వద్ద ఎక్కువగా ఉంటోంది. నగరంలో మొత్తం 585 ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణ (పాయింట్ డ్యూటీ)లో ఉంటున్నారు. అన్నిచోట్లా కాలుష్యం స్థాయి ఒకేలా ఉండట్లేదు. వాహన శ్రేణి, రాకపోకల సంఖ్య ఆధారంగా లెక్కిస్తే 125 జంక్షన్లలో అత్యంత తీవ్రంగా... మరో 200 జంక్షన్లలో తీవ్రంగా ఉంటోంది. కాలుష్య నియంత్రణ మండలి నివేదికల ఆధారంగా ట్రాఫిక్ పోలీసుల గతంలో ఈ గణాంకాలను రూపొందించారు. ఈ వాయు కాలుష్యానికి తోడు ప్రమాణాలు పాటించని/ మోడ్రన్ హారన్లు, శక్తిమంతమైన లైట్లు శబ్ధ, కాంతి కాలుష్యాలకూ కారకాలవుతున్నాయి. వీటికి చెక్ చెప్పేందుకు అవసరమైన యంత్రాలు, యంత్రాంగం లేకపోవడంతో ఇబ్బందులు నానాటికీ పెరుగుతున్నాయి.
ప్రమాదపుటంచుల్లో ట్రాఫిక్ సిబ్బంది....
ఈ పరిస్థితుల్లో పని చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 2012లో ట్రాఫిక్ సిబ్బందికి నిర్వహించిన సామూహిక వైద్య పరీక్షల ఫలితాలను విశ్లేషించిన నాటి ట్రాఫిక్ చీఫ్ సీవీ ఆనంద్ ఆందోళనకర అంశాలను గుర్తించారు. నగర ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న వారిలో అనేక మంది ఊపిరితిత్తులు, కళ్లు, చెవులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. సరాసరిన 32 శాతం మందికి ఊపిరితిత్తుల, 25 శాతం మందికి కంటి, ఏడు శాతం మందికి చెవి సంబంధ రుగ్మతలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి జీతానికి అదనంగా పొల్యూషన్ పే ఇప్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు 30 శాతం ఇప్పించాలంటూ సీవీ ఆనంద్ అప్పట్లో పార్లమెంట్ స్థాయీ సంఘాన్ని కోరారు. వారు ఆమోదముద్ర వేయడంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. వీటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అనేక మార్పుచేర్పులతో 2016 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అక్కడ అలా... ఇక్కడ ఇలా...
పోలీసు విభాగంలో లూప్‌లైన్లుగా భావించే అవినీతి నిరోధక శాఖ, పోలీసు అకాడమీల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతంపై అదనంగా 30 శాతం చెల్లించే విధానం అమలులో ఉంది. కీలక బాధ్యతలు నిర్వర్తించే సీఐ సెల్, ఆక్టోపస్, సీఐడీ, సీఎస్‌డబ్ల్యూల్లోనూ అదనపు చెల్లింపు విధానం అమలవుతోంది. అయితే అక్కడ అన్ని స్థాయిల అధికారులకు ఇది వర్తిస్తుంది. ట్రాఫిక్ విభాగం దగ్గరకు వచ్చేసరికి తొలుత కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు ఇచ్చారు. ఆపై హోంగార్డుల్నీ ఈ జాబితాలో చేర్చారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం ఉన్నతాధికారులు సైతం పాయింట్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో ఏసీపీలు, అదనపు డీసీపీలు, డీసీపీలు, ట్రాఫిక్ చీఫ్‌కు ఇది వర్తించాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటికీ సర్కారు దీనిపై దృష్టి పెట్టట్లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ విభాగంలోనే పని చేస్తున్న తమకూ ఆ పొల్యూషన్ పే అమలు చేయాలని కోరుతున్నారు. ఈ దిశలో డీజీపీ కార్యాలయం సైతం కృషి చేయాలని వేడుకుంటున్నారు.
ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకే పొల్యూషన్ పే
2016 నుంచి 30 శాతం ఇస్తున్న సర్కారు
మరికొన్ని విభాగాల్లోనూ ప్రోత్సాహకాలు
అక్కడ మాత్రం అన్ని ర్యాంకులకు వర్తింపు
తమకూ ఇవ్వాలంటున్న ఉన్నతాధికారులు