
అక్రమార్కుల ఆగడాలకు చెక్!
3.5 ఎకరాల సర్కారు స్థలంపై కబ్జాదారుల కన్ను
బంజారాహిల్స్: మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కబ్జాదారులు చేయని కుయుక్తులు లేవు. పట్టు వదలని విక్రమార్కుల్లా భూమిపై పట్టు నిలుపుకోవాలని అటు పోలీసుల్ని, ఇటు రెవెన్యూ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎంతో విలువైన మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. కబ్జాదారు పార్థసారథి, ఆయన కొడుకు విజయ భార్గవన్ ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఇక్కడి చెట్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. శుక్రవారం 12 సీసీ కెమెరాలను రెవెన్యూ యంత్రాంగం తొలగించింది.
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి..
షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం–10లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఎదురుగా తట్టిఖానా వాటర్ రిజర్వాయర్‌ను ఆనుకొని సర్వే నెం. 403/పిలో ప్రభుత్వానికి చెందిన 5 ఎకరాల స్థలం ఉంది. ఇందులో కొంత మంది అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జా చేసేందుకు ఎనిమిదేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేయడంతో పాటు రౌడీలను సైతం దింపి ఈ స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ స్థలాన్ని కబ్జా చేసిన పార్థసారథి, ఆయన కొడుకు విజయ్ భార్గవ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంలో షేక్‌పేట రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా కేసులు కూడా నమోదయ్యాయి. మూడుసార్లు ఈ స్థలంలోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు నిర్మాణాలు కూల్చివేసి అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు. అయినాసరే కబ్జాదారులు ఈ స్థలంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారాన్ని తమ అధీనంలోకి తీసుకొని లోపల ఒక గదిని నిర్మించి రౌడీలను పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు.. కబ్జా జరిగిన స్థలం లోపల ఉన్న అయిదుగురు రౌడీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
చెట్లపై సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా
వీటిని తొలగించిన రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు: షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి
అధికారుల కళ్లుగప్పి..
ఠాణాలో క్రిమినల్ కేసులు నమోదైనా.. రౌడీలను తరి మేసినా.. అక్రమ నిర్మాణా లు కూల్చివేసినా.. సదరు కబ్జాదారులు మాత్రం ఈ స్థలంలో తిష్ట వేశారు. ఎలా గైనా భూమిని కబ్జా చేసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కబ్జాదారుల ఆగడాలకు షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి చెక్ పెట్టినా.. అధికారుల కళ్లు గప్పి సెలవురోజుల్లో కబ్జాదారులు స్థలంలోకి చొచ్చుకొస్తున్నారు. అయిదెకరాల ఈ ప్రభుత్వ స్థలం పూర్తిగా ప్రభుత్వానికి చెందినదేనని.. ఇందులో ఎకరన్నర స్థలం తట్టిఖానా వాటర్ రిజర్వాయర్ కోసం కేటా యించినట్లు.. మిగతా మూడున్నర ఎకరాల భూమి పక్కాగా ప్రభుత్వానిదేనని తహసీల్దార్ అనితారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని.. అందుకోసమే లోపల హెచ్చరిక బోర్డులతో పాటు బ్లూషీట్లపై ఇది ప్రభుత్వ భూమి అని రాసినట్లు ఆమె తెలిపారు. కబ్జాదారులు మరోసారి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె హెచ్చరించారు.