
మ్యాన్‌హోళ్లలో బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసుల తీరు మారడం లేదు. సీవరేజీ పైపులైన్‌లో వ్యర్థాలే కాదు.. కరగని ఘన పదార్థాలు, మురుగు ప్రవాహానికి అడ్డుపడే బ్లాంకెట్లు, బెడ్‌షీట్లను సైతం వదిలేస్తున్నారు. సీవరేజీ ఓవర్ ఫ్లో కట్టడికి 180 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మ్యాన్‌హోల్ టు మ్యాన్‌హోల్ డీ– సిల్టింగ్ చేసినా.. సీవరేజీ వ్యర్థాలపై అవగాహన కల్పించినా మార్పు రావడంలేదు. ఇటీవల మలక్‌పేట నల్లగొండ చౌరస్తా వద్ద సీవరేజీ ఓవర్ ఫ్లో పై ఫిర్యాదుల వస్తుండంతో జలమండలి అధికారులు శుక్రవారం డీ– సిల్టింగ్ పనులు నిర్వహించారు. జెట్టింగ్ యంత్రాలను ఉపయోగించి మ్యాన్‌హోళ్ల నుంచి సిల్ట్‌ను బయటికి తీయగా.. అందులోంచి బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు, దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు ఇతర ఘన పదార్థాలు బయటపడ్డాయి. దీని కారణంగా ఆ ప్రాంతంలోని మ్యాన్‌హోళ్లు ఓవర్‌ఫ్లో అవుతున్నట్టు గుర్తించారు. ఇకనుంచి ఎవరైనా మ్యాన్‌హోళ్లలో చెత్త, వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.
వాణిజ్య భవనాల్లో సిల్ట్ చాంబర్లు తప్పనిసరి
వాణిజ్య భవన సముదాయాల్లో సిల్ట్ చాంబర్లు తప్పనిసరి అని జలమండలి సూచించింది. రెస్టారెంట్లు, హాస్టల్స్, హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, ఆఫీసులు తదితర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు, బహుళ అంతస్తు భవన సముదాయాల నిర్వాహకులు.. తమ సీవరేజీ పైపులైన్‌ను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్ వర్క్‌కు అనుసంధానం చేయడంతో వాటి నుంచి వచ్చే ఘన, కరగని వ్యర్థ పదార్థాలు మురుగు ప్రవాహనికి అడ్డుపడుతున్నాయి. ప్రధానంగా సిల్ట్ చాంబర్లు లేకపోవడంతో సీవరేజీ పైపులైన్లపై ఒత్తిడి పెరిగి అవి ఓవర్ ఫ్లో అవుతున్నాయి. మరోవైపు నివాస సముదాయాల నుంచి సీవరేజీ పైపులైన్‌లో బ్లాంకెట్లు, బెడ్‌షీట్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, వాటర్ బాటిళ్లు, ఘన పదార్థాలు లాంటి వ్యర్థాలు వదలడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
నల్లగొండ చౌరస్తా వద్ద డీ– సిల్టింగ్‌లో వెలికితీత
అవగాహన కల్పించినా.. మారని తీరు
బయటపడుతున్న ఘన పదార్థాలు.. వ్యర్థాలు