
సీఆర్‌ఎంపీ రోడ్ల నిర్వహణకు టెండర్లు
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) కింద ప్రధాన మార్గాల్లోని రహదారుల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ టెండర్లు ఆహ్వానిస్తోంది. ఐదేళ్ల క్రితం ఈ పనుల్ని పెద్ద కాంట్రాక్టు ఏజెన్సీలకిచ్చిన గడువు గత డిసెంబర్– జనవరిల్లోనే ముగిసిపోయింది. కానీ.. ఇప్పటివరకు మళ్లీ టెండర్లు పిలవలేదు. గతంలో మాదిరిగానే మళ్లీ పెద్ద ఏజెన్సీలకిచ్చే యోచనలో ఉన్న ఇంజినీరింగ్ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలతో స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వ అనుమతి కోసం సచివాలయానికి పంపి వేచి చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో.. తాత్కాలికంగా కొంత కాలం వరకై నా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే ఈ పనులు చేసేందుకు తాజాగా టెండర్లు పిలుస్తున్నారు. వాస్తవానికి మే నెల ముగిసేలోగానే రీ కార్పెటింగ్, మరమ్మతులు తదితరమైనవి పూర్తి చేయాల్సి ఉండగా, స్పష్టత లేకపోవడంతో పనులు చేయలేదు.
తాజాగా సికింద్రాబాద్ జోన్ పరిధిలో..
ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో పెరిగే వర్షాలకు రోడ్లు దెబ్బతింటాయి. ఇప్పటికే వివిధ సంస్థల అవసరాల కోసం తవ్వకాలకు అనుమతులివ్వడంతో, అనుమతులున్న వాటితోపాటు లేని ప్రాంతాల్లోనూ అడ్డదిడ్డంగా రోడ్లను తవ్వి వదిలేశారు. వాటిని తిరిగి పూడ్చాల్సి ఉంది. వర్షాలకు గోతులు పడితే ప్రజలతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయని గ్రహించి.. జూన్ వరకు పనుల కోసమంటూ తాజాగా సికింద్రాబాద్ జోన్‌లో టెండర్లు పిలిచారు. లేన్ మార్కింగ్‌లు, క్యాచ్‌పిట్స్ మరమ్మతులు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లకు రంగులతో సహా సీఆర్‌ఎంపీ రోడ్ల నిర్వహణకు రూ.1.03 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. పెద్ద ఏజెన్సీలకిచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేంత వరకు తాత్కాలికంగా ఈ టెండర్లు పిలిచారు. మిగతా జోన్లలోనూ పిలవనున్నట్లు తెలుస్తోంది.
లేన్‌మార్కింగ్‌లు, క్యాచ్ పిట్స్ పనులు సహా..
తాత్కాలికంగా జూన్ వరకు మాత్రమే..
ప్రభుత్వ నిర్ణయమేంటో?
ఒక ప్రతిపాదన మేరకు గతంలో ఉన్న మార్గాల్లోనే అంతే దూరం పనులుండగా, మరో ప్రతిపాదనలో అదనంగా కొన్ని రోడ్లను చేర్చడంతో పాటు ఈసారి అదనంగా పూడికతీత పనులు కూడా చేర్చారు. గతంలో ఎప్పటికప్పుడు రోడ్ల రీకార్పెటింగ్, గుంతల పూడ్చివేత, స్వీపింగ్, గ్రీనరీ, ఫుట్‌పాత్‌లు, లేన్‌మార్కింగ్‌ల పనులుండేవి. పాత మార్గాల్లోని రోడ్లకే అయితే.. 744 కి.మీ. నిర్వహణకు అంచనా వ్యయం రూ.2,491 కోట్లు కాగా, కొత్త రోడ్లు కూడా కలిపి 1,142 కి.మీ. నిర్వహణకు రూ.అంచనా వ్యయం రూ.3,825 కోట్లు. గతం కంటే 398 కి.మీ. మేర పనులు, రూ.1,334 వ్యయం అదనం. వీటిలో ప్రభుత్వం దేనికి అనుమతిస్తుందో, లేక ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.