
చెరువుల పక్కన, ఖాళీ ప్లాట్లలో యథేచ్ఛగా బోర్లు
సాక్షి, సిటీబ్యూరో:
భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికే కాదు.. ఇంటి అవసరాలూ తీరే పరిస్థితి కనిపించడంలేదు. నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో విచ్చలవిడిగా బోర్ల తవ్వకాల ప్రభావంతో జలాలు పాతాళానికి పడిపోయి బోరుబావులు బావురుమంటున్నాయి. ఫలితంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. రాత్రి పగలూ తేడా లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోంది. సిటీజనుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు చెరువుల పక్కన, ఖాళీ ప్లాట్లలో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసి, కోట్ల కొద్దీ లీటర్ల నీటిని పుడమి కడుపు నుంచి తోడేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి.. అక్కడ ఉన్న నీటి కొరత తీవ్రత, అత్యవసరాన్ని బట్టి ట్యాంకర్ నీటి ధరను పెంచేసి వసూళ్లకు పాల్పడుతున్నారు.
జంట జలాశయాల పరీవాహకంలో..
నగర శివార్లలోని జంట జలాశయాల పరిసరాల్లో విచ్చలవిడిగా ప్రైవేటు ఫిల్లింగ్ కేంద్రాలు భారీగా పుట్టుకొచ్చాయి. మూసీ పరీవాహకంలో సైతం ప్రైవేటు బోర్ల నీటి దందా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. అసలు బోరు ఎక్కడుంది? ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది. చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాల్లో ఎక్కడిపడితే అక్కడ బోర్లు ఏర్పాటు చేసి గుర్తించకుండా వాటి చుట్టూ ఇంటిని తలపించేలా రేకుల షెడ్లు వేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సిమెంట్, కాంక్రీట్‌తో శ్లాబ్‌లు నిర్మిస్తున్నారు. గండిపేట, నార్సింగ్, మణికొండ, హఫీజ్‌పేట, మియాపూర్, బౌరంపేట, దుండిగల్, మల్లంపేట, ఉప్పల్, రామంతాపూర్, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో చెరువుల పక్కన ప్రైవేటు బోర్ల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది
వాల్టాకు తూట్లు..
వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ (వాల్టా) యాక్ట్– 2002 ప్రకారం ఇంటి అవసరాల కోసం బోరు వేసినా రెవెన్యూ విభాగం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి పరిస్థితులు, దరఖాస్తుదారు అవసరం, అక్కడి భూగర్భ జలాల లభ్యతను బట్టి అనుమతినిస్తారు. ఇంటి నిర్మాణం కోసం సామాన్యులు బోరు వేస్తే.. ఈ చట్టాన్ని చూపి నానా ఇబ్బందులూ పెట్టే రెవెన్యూ యంత్రాంగం ప్రైవేటు నీటి దందా కోసం ఇష్టానుసారంగా పదుల సంఖ్యలో బోర్లు తవ్వి పుడిమిని తోడేస్తున్నా.. కనీసం అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఇటీవల జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ ఫిల్లింగ్ కేంద్రాలను గుర్తించి రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లింది.
ఇదీ పరిస్థితి..
మహానగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో వర్షపు నీరంతా నాలాలు, డ్రెయినేజీల నుంచి మూసీలో కలుస్తోంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో నగర పరిధిలో భూగర్భ జలమట్టాలు పెరగలేదు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు ఔటర్ పరిధిలోని సుమారు 45 ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు సగటున 12 మీటర్ల దిగువన పడిపోయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి నుంచి 5 వేల అడుగుల మేర తవ్వించిన బోర్లు సైతం ఎండిపోతుండటంతో భూగర్భజలాలు ఎంత పాతాళానికి పడిపోతున్నాయో అర్థం చేసుకొవచ్చు..
జలమండలి ట్యాంకర్ల తాకిడి
గ్రేటర్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలి ఈసారి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేక తడబడుతోంది. పశ్చిమ హైదరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, మూసాపేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, నానక్‌రాంగూడ, కోకాపేట్, నార్సింగి, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల నుంచి తాకిడి అధికంగా పెరిగినట్లు తెలుసోంది. సాధారణంగా వాటర్‌బోర్డుకు వేసవిలో రోజుకు 5 వేల నుంచి 6 వేల వరకు ట్యాంకర్ల డిమాండ్ ఉంటోంది. కానీ.. ఈసారి ఆ సంఖ్య పదివేలు దాటింది. ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపు ట్యాంకర్‌ను సరఫరా చేయడం గమనార్హం. కేవలం ట్యాంకర్లపైనే ఆధారపడిన హోస్టళ్లు, సర్వీస్, వాణిజ్య కేంద్రాలు మాత్రం అత్యవసర సరఫరాకు ప్రైవేటు ట్యాంకర్ల వైపు మొగ్గుచూపుతున్నాయి.
అక్రమ ఫిల్లింగ్ కేంద్రాలతో ప్రైవేటు ట్యాంకర్ల దందా
పశ్చిమ హైదరాబాద్‌లో పెరిగిన డిమాండ్
నీటి రేట్లు పెంచేసి వ్యాపారుల దోపిడీ
ప్రతిరోజూ పది వేల ట్రిప్పులకుపైగా జలమండలి సరఫరా
4 లక్షల ట్రిప్పుల వరకు అంచనా..
రాబోయే రోజుల్లో ట్యాంకర్లకు డిమాండ్ మరింత పెరిగవచ్చని జలమండలి అంచనా వేస్తొంది. గత ఏడాదితో పోల్చితే ఈసారి జనవరిలో 35 శాతం, ఫిబ్రవరిలో 50 శాతం, మార్చిలో 90 శాతం అదనంగా డిమాండ్ పెరిగినా.. ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేయగలిగింది. తాజాగా ఈ నెలలో రెట్టింపు స్థాయిలో ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. ఏప్రిల్, మే నెలల్లో సగటున 4 లక్షల ట్రిప్పుల చొప్పున డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందని జలమండలి అంచనా వేస్తోంది.
జలమండలి ద్వారా ట్యాంకర్ల సరఫరా ఇలా
సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి
2021 52,778 55,175 75,782
2022 45,613 52,548 83,078
2023 74,870 86,479 1,12,679
2024 81,821 1,12,926 1,69,596
2025 1,19,752 1,84,074 2,82,961

చెరువుల పక్కన, ఖాళీ ప్లాట్లలో యథేచ్ఛగా బోర్లు

చెరువుల పక్కన, ఖాళీ ప్లాట్లలో యథేచ్ఛగా బోర్లు