
‘భూ భారతి’
భూముల రక్షణకే
నేటి నుంచి 30 వరకు చట్టంపై అవగాహన సమావేశాలు
సదస్సుల సమాచారం
తేదీ మండలం
17 షాద్‌నగర్, కేశంపేట
19 ఆమనగల్లు, తలకొండపల్లి
21 చేవెళ్ల, శంకర్‌పల్లి
22 కొందుర్గు, చౌదరిగూడ
23 మాడ్గుల, యాచారం
24 మెయినాబాద్, షాబాద్, గండిపేట్
25 మంచాల, ఇబ్రహీంపట్నం
26 కొత్తూరు, నందిగామ, శంషాబాద్
28 అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, సరూర్‌నగర్
29 మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్
30 శేరిలింగంపల్లి,
రాజేంద్రనగర్, బాలాపూర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న భూ భారతి చట్టానికి సంబంధించిన పోర్టల్‌ను ఆవిష్కరించి రైతు కుటుంబాలకు అంకితం చేసింది. జూన్ 2 నుంచి పోర్టల్ అమలు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్న ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఈ నెల 30 వరకు మండలాల వారీగా రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌ఓఆర్)–2025 భూమి హక్కుల రికార్డు, ధరణి స్థానంలో కొత్తగా తీసుకురాబోతున్న భూ భారతి, ఆర్‌ఓఆర్‌లో తప్పుల సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, వారసత్వ భూముల మ్యూటేషన్, సేల్‌డీడ్ ఇతర మార్గాల ద్వారా వచ్చిన మ్యూటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, రివిజన్ అధికారాలు, న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించడంతో పాటు భూములకు (కమతం) ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయింపు సహా ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు సైతం ఈ నంబర్ల ఆధారంగానే అందనున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని నిర్ణయించింది. ఆర్డీఓ, తహసీల్దార్ సహా డి సెక్షన్ అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని, రైతులు, భూ యజమానుల్లోని అనుమానాలను నివృత్తి చేయనున్నారు. తద్వారా రెవెన్యూ శాఖపై సృష్టించిన అపవాదులను పూర్తిగా తొలిగించుకోవాలని యోచిస్తోంది.
రిజెక్ట్ చేస్తే.. కారణం చెప్పాల్సిందే
జిల్లా వ్యాప్తంగా 12,43,035 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో 64,803 ఎకరాల అటవీ భూములు ఉండగా 8,86,705 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. 2,26,509 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. 1,89,406 ఎకరాలు తోటలు, చెట్లతో నిండి ఉంది. 59,906 ఎకరాలు సాగుకు యోగ్యం కానీ భూములున్నాయి. ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్, సీలింగ్, లావణి, అటవీ భూములతో పాటు ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయి. నగరానికి సమీపంలో జిల్లా ఉండడం, ఐటీ, అనుబంధ సంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులు ఇక్కడ భారీగా పెడుతుండటంతో జిల్లాలోని భూములకు రెక్కలొచ్చాయి. దీంతో పాటు సరిహద్దు వివాదాలు కూడా అధిక మయ్యాయి. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 నవంబర్‌లో ధరణి ఫోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పోర్టల్‌లో నమోదు కాగా, ఇప్పటికే 1.80 వేల దరఖాస్తులను క్లియర్ చేయగా.. ప్రస్తుతం 17,646 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వీటిలో 7,966 దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద, 3,351 దరఖాస్తులు ఆర్డీఓల వద్ద, అదనపు కలెక్టర్ వద్ద 4,877 దరఖాస్తులు, కలెక్టర్ వద్ద 1,452 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. గతంలో దరఖాస్తు తిరస్కరిస్తే. కారణం చెప్పేవారు కాదు. ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన భూ భారతిలో అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్న భూ భారతిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తోంది.
కమతాలకు భూదార్ నంబర్ల కేటాయింపు
వాటి ఆధారంగానే సంక్షేమ ఫలాలు