
సాక్షి, హైదరాబాద్: సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్‌తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్‌ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్‌కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్‌కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.
రాజాసింగ్‌తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారానే సిరాజ్‌తో టచ్‌లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్‌ను కాంటాక్ట్ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.