
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు
● తనిఖీలు చేపట్టిన బాంబు స్క్యాడ్ ●అంతా ఉత్తిదేనని తేల్చిన పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టరేట్‌ను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు మెయిల్ పెట్టాడు. దీంతో ఈ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్ గౌతమ్ రాచకొండ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో డీసీపీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ ఏసీపీ గురువారం మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మేడ్చల్ కలెక్టరేట్‌లోని వివిధ శాఖల్లో బాంబు స్క్వాడుతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి బాంబు జాడ లేకపోవటంతో.. ఉత్తుత్తి బెదిరింపులేనని పోలీసులు తేల్చారు. దీంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కలెక్టర్ గౌతమ్‌కు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు వివిధ విభాగాల జిల్లా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మధ్యాహ్నం 3 గంటలకు తమ కార్యాలయాల నుంచి బయటకు వెళ్లిపోయారు. బాంబు బెదిరింపు మెయిల్ మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణరావు పేరిట రావటంతో పాటు.. అందులో ముస్లిం సంస్థలకు సంబంధించిన పేర్లతో సహా అన్నాడీఎంకే తదితర పార్టీలు, సంస్థల పేర్లు ఉండటంతో.. కావాలనే ఎవరో ఆగంతకుడు మెయిల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చర్చోపచర్చలు..
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ మెసేజ్‌పై పలు రకాలుగా చర్చ సాగుతోంది. జిల్లాలో పలువురు ఉన్నత స్థాయి అధికారులు తమ సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలకు సమయం కేటాయించక పోవటం వల్లే.. విసుగెత్తి ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాంబు బెదిరింపుపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు.