అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా అరెస్టు

Dec 22 2024 10:30 AM | Updated on Dec 22 2024 10:30 AM

అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా అరెస్టు

అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా అరెస్టు

పటాన్‌చెరు టౌన్‌: నూతన సంవత్సర వేడుకల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.కోటి విలువైన 1000 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రూపేశ్‌ నార్కోటిక్స్‌ బ్యూరో ఎస్పీ చైతన్యతో కలిసి శనివారం పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నార్కోటిక్స్‌ బ్యూరోకు అందిన సమాచారం మేరకు స్థానిక పోలీసులతో కలిసి శుక్రవారం సాయంత్రం పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్‌ జాతీయ రహదారి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా..అదుపులోకి తీసుకుని విచారించారు. ముంబైకి చెందిన అబ్దుల్‌ హమీద్‌ షేక్‌, ముఖేష్‌ దూబే అనే ఇద్దరు వ్యక్తులు నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్‌కు చెందిన షేక్‌ అమీర్‌కు అప్పగించేందుకు వెయ్యి గ్రాముల మాదకద్రవ్యాలు తీసుకుని వచ్చినట్లు తెలిపారు. వీరిద్దరూ ఢిల్లీలో ఉంటున్న జెమ్మీ, జిన్నీ అనే నైజీరియన్ల వద్ద వీటిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఢిల్లీలో గ్రాము రూ. వెయ్యి చొప్పున కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో రూ.4 వేల నుంచి 5 వేలకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరితోపాటు ముంబైకి చెందిన రాయిస్‌ఖాన్‌ అనే వ్యక్తి సైతం నిషేధిత డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు నిందితుల విచారణలో వెల్లడైందన్నారు. కొనుగోలు దారులను సైతం గుర్తించామని త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. నిందితుల నుంచి రూ.కోటి విలువైన ఎండీఎం, నాలుగు మొబైల్‌ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఢిల్లీలో వీరికి డ్రగ్స్‌ విక్రయించిన జెర్రీ,జిమ్మీ, రైస్‌ రియాజ్‌ ఖాన్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్‌ తయారు, రవాణా, విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా నార్కోటిక్‌ బ్యూరో (87126 56777) నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమావేశంలో డీఎస్పీలు శ్రీధర్‌, రవీందర్‌ రెడ్డి, సీతారాం, పటాన్‌చెరు సీఐలు వినాయక్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

రూ.కోటి విలువైన మత్తుపదార్థాల పట్టివేత

నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్‌లో విక్రయించేందుకు యత్నం

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రూపేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement