
వదల బొమ్మాళీ.. వదల!
రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టినా కదలని ఇన్‌చార్జ్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర తూనికలు, కొలత శాఖ లెక్క తప్పింది. తూకాలు, మోసాలపై పర్యవేక్షణేమో గానీ, పరిపాలనపరమైన వ్యవహారాల్లో సైతం జవాబుదారీతనం కొరవడింది. సాక్షాత్తు ప్రధాన కార్యాలయంలోని పరిపాలన విభాగంలో రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ నెలరోజుల క్రితం వరకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించిన అధికారి మాత్రం చాంబర్‌ను వదలా.. కదలా.. అంటూ యధావిధిగా ఫైళ్లను పరిశీలిస్తుండటం ఉద్యోగ వర్గాల్లో చర్చనీంశంగా మారింది. ఇటీవల తూనికల, కొలతల శాఖలో పలువురికి పద్నోతులు కల్పిస్తూ రాష్ట్ర కంట్రోలర్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్–1 డిస్ట్రిక్ ఇన్‌స్పెక్టర్(డీఐ)కి అసిస్టెంట్ కంట్రోలర్(ఏసీ)గా పదోన్నతి కల్పించి ప్రధాన కార్యాలయంలోని పరిపాలన విభాగంలో హెడ్‌క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్‌గా రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారు. జూలై 31న పదోన్నతి పొందిన సదరు అధికారిణి తక్షణమే రిపోర్టు చేసి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్‌గా విధులు నిర్వహించిన వరంగల్ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్‌ఎసీ)ల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ, రెగ్యులర్ అధికారిణి డ్యూటీలో చేరినప్పటికి 25 రోజులుగా సదరు అధికారి మాత్రం కార్యాలయానికి త్వరగా వచ్చి ప్రధాన సీటుపై కూర్చుంటూ ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు హెడ్ క్వార్టర్ ఏసీగా వ్యవహరించిన సదరు అధికారి సీనియర్ కావడం, మరోవైపు పలువురు ఉద్యోగుల పదోన్నతి ఫైళ్ల వ్యవహారం ఉండటంతో ఆయన అనుభవం తనకు సహకారంగా ఉంటుందని సదరు అధికారిణి కూడా మిన్నుకుండినట్లు సమాచారం. అయితే వారం రోజుల క్రితం పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో రెగ్యులర్ అధికారిణి ఆఫీస్‌కు ఆయన కంటే ముందుగానే వచ్చి ప్రధాన కుర్చీలో కూర్చుంటున్నారు. అయినా సదరు అధికారి మరో సాధారణ కుర్చీలో కూర్చొని ఫైళ్లు పరిశీస్తూ చాంబర్‌ను వదలక పోవడం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర కంట్రోలర్ కూడా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
హాజరెట్లెట్టా..?
ప్రధాన కార్యాలయంలో హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్తి అదనపు బాధ్యతలను నుంచి నుంచి తప్పుకున్నా వరంగల్‌లోని రెగ్యులర్ ఏసీ విధులకు హాజరు కాకుండా హెడ్ క్వార్టర్‌లోనే ఉండిపోవడంతో హాజరు నమోదుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పోస్టింగ్‌లో కాకుండా ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తే, న్‌ఆన్ డ్యూటీ హెడ్ ఆఫీస్ (ఓడీహెచ్) అని హాజరు పట్టికలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులైతే మాత్రం ఆ శాఖాధిపతి అనుమతి తప్పనిసరి. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయంలోనే తిష్ట వేసి ఫైళ్లు తిరగేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఇటీవల జరిగిన ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో కూడా చేతివాటం ప్రదిర్శంచినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
అదనపు బాధ్యతల మాటున తప్పిదాలెన్నో..
సదరు అధికారి పలు నిబంధనలు సైతం తుంగలో తొక్కి పదోన్నతులు, కొత్త పోస్టింగ్‌ల్లో పలు జిమ్మిక్కులు చేసినట్లుగా విమర్శలు ఉన్నాయి. పదోన్నతులతో కొత్త స్థానాల్లో చేరినవారు కొద్ది నెలలకే తాము కోరుకున్న చోటుకు బదిలీ చేయడం గమనార్హం. వాస్తవంగా బదిలీలపై నిషేధం కొనసాగుతోంది. అయినా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 20న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పరిపాలనా సౌలభ్యానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. పదోన్నతుల ద్వారా పోస్టింగ్‌లో చేరి శిక్షణ పూర్తి చేసిన తర్వాత కొందరికి పోస్టింగ్ మార్చి కోరుకున్న స్థానాల్లో బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని ఇలా....
● పదోన్నతి ద్వారా హైదరాబాద్ సీసీ–1 ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ లభించిన ఉద్యోగికి జనగామాకు, హెడ్ క్వార్టర్ హైదరాబాద్–1 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పోస్టింగ్‌లో చేరిన మరో ఉద్యోగికి రంగారెడ్డి జిల్లా ఆఫీస్‌కు బదిలీ చేశారు.
● మేడ్చల్–మల్కాజిగిరి డీఐ పోస్టు సస్పెన్షన్‌తో ఖాళీ కాగా, ఆ స్థానంలో నల్లగొండ డీఐకి బదిలీపై పోస్టింగ్ ఇచ్చారు. వాస్తవంగా బదిలీలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టుకు ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు. కానీ, నేరుగా బదిలీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
● నిబంధనల ప్రకారం నిషేధిత కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేయాలంటే కూడా ప్రభుత్వం ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ, తూనికలు, కొలతల శాఖ పరిపాలనా విభాగం నిబంధనలను తుంగలోకి తొక్కి సిఫార్సులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరగడంతో ట్రెజరీ అండ్ అకౌంట్ విభాగం వారి వేతనాల చెల్లింపు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
అదే చాంబర్‌లో నెలరోజులుగా విధులు
సాక్షాత్తు ప్రధాన కార్యాలయంలో నిబంధనలు తూచ్
గతంలో పోస్టింగ్, పదోన్నతుల్లో చేతివాటం ఆరోపణలు
పట్టని తూనికలు, కొలతల శాఖ రాష్ట్ర కంట్రోలర్

వదల బొమ్మాళీ.. వదల!